Begin typing your search above and press return to search.

చంద్రు వ్యాఖ్య‌ల‌పై సీజేకు RRR ఫిర్యాదు

By:  Tupaki Desk   |   14 Dec 2021 3:30 PM GMT
చంద్రు వ్యాఖ్య‌ల‌పై సీజేకు RRR ఫిర్యాదు
X
జస్టిస్ చంద్రు ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల విడుదలైన సూర్య జై భీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయ‌న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో కొందరు ఆయ‌న‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలను సైతం హైకోర్టు న్యాయమూర్తులు తప్పుపట్టారు. ఇక ఇప్పుడు వీటిపై వైసిపి రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు రఘురామకృష్ణంరాజు స్పందించారు.

చంద్రుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ర‌ఘురామ‌ ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి అయిన చంద్రు ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలు, తన ప్రత్యర్థుల‌ కంటే ఎక్కువగా కోర్టుల‌తోనే పోరాటం చేయాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు సైతం ఇప్పటికే కౌంటర్ లు ఇచ్చారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేకపోయినా తాము విధులు నిర్వహిస్తున్నామ‌న్న విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు చెప్పారు. కోర్టుల్లో క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే అని కూడా వారు చెప్పారు. ఇక రఘురామకృష్ణంరాజు తన లేఖలో చంద్రుడు చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలను మీ దృష్టికి తీసుకు వస్తున్నామని... గతంలో తమ పార్టీకి చెందిన ఒక ఎంపీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

జస్టిస్‌ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు.. గౌరవ స్థానాల్లో ఉన్న వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై ఉన్న న‌మ్మ‌కాన్ని దెబ్బ‌తీస్తాయ‌న్న ఆందోళ‌న ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయ‌వ్య‌వ‌స్థ గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ఉన్న ఈ కుట్రపై సుమోటోగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయాల‌ని ర‌ఘురామ లేఖ‌లో కోరారు.