Begin typing your search above and press return to search.

జగన్ పై తిరుగుబాటు ఎంపీ మరో కేసు

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:17 AM GMT
జగన్ పై తిరుగుబాటు ఎంపీ మరో కేసు
X
జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విచారణ సమగ్రంగా జరగలేదంటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ దర్యాప్తు అసమగ్రంగా ఉందనేది ఎంపీ తాజా ఆరోపణ. అందుకని పూర్తి స్ధాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపించేలా సీబీఐని ఆదేశించాలని ఎంపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ను ఏదోలా ఇబ్బందులకు గురిచేయటం, కోర్టుల చుట్టూ తిరిగేలా చేయటమే జీవిత ధ్యేయంగా ఎంపీ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.

గతంలో రెండు కేసుల్లో ఎంపీకి కోర్టు ఫుల్లుగా క్లాసు తీసుకుంది. జగన్ కు ప్రభుత్వానికి వ్యతిరేరకంగా ఎంపీ వేసిన అనేక కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయాలని, చింతామణి నాటకంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కీలకమైనవి. నిజానికి ఈ రెండు కేసుల్లోను ఎంపీకి ఎలాంటి సంబంధాలు లేవు. ఇదే విషయాన్ని ఎంపీని సూటిగా ప్రశ్నించిన కోర్టు ఎంపీకి ఫుల్లుగా క్లాసుపీకింది. ఎలాంటి సంబంధం లేకుండానే మీరెందుకు కేసులు వేశారని నిలదీసింది. రెండు కేసులను కొట్టేసింది.

ఇపుడు జగన్ అక్రమాస్తులపై విచారణంటు మరో కేసు వేశారు. జగన్ అక్రమాస్తులపై సీబీఐ జరపాల్సినంత లోతుగా విచారణ చేయలేదట. విచారణ బాధ్యతను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్, ఇన్కమ్ టాక్స్ విభాగాలకు ఇచ్చేసి సీబీఐ చేతులు దులిపేసుకుందనేది ఎంపీ వాదన.

విదేశాల నుంచి, బోగస్ కంపెనీల నుంచి జగన్ కంపెనీల్లోకి వచ్చిన నిధులపై సీబీఐ సరిగా దర్యాప్తు చేయలేదని ఎంపీ వాదిస్తున్నారు. నిజానికి జగన్ అక్రమాస్తుల ఆరోపణలపై దాదాపు 13 సంవత్సరాలుగా దర్యాప్తులు, విచారణలు జరుగుతునే ఉన్నాయి. ఒక్క కేసు కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇంకెంత కాలం పడుతుందో కూడా తెలీదు.

ఈ నేపధ్యంలోనే ఎంపీ మళ్ళీ ఇంకో కేసు వేశారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి అసలు పిటీషన్ విచారాణర్హత ఏమిటో తొందరలోనే తేల్చేస్తామన్నారు. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో ఎంపీ భాగస్తుడు కాదు, సాక్షి కాదు చివరకు బాధితుడు కూడా కాదు. జగన్ను ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఎక్కడో కేసులో ఇరికించాలన్న ఆలోచన తప్ప ఇంకేమీ కనబడటం లేదు. అందుకనే పదే పదే జగన్ను టార్గెట్ చేసుకుని కేసులేస్తున్నారు. ఒకవైపు కేసులను కొట్టేస్తున్న మళ్ళీ మళ్ళీ ఏదో రకంగా కేసులేస్తున్నారు. మరి తాజా కేసును కోర్టు ఏమి చేస్తుందో చూడాలి.