Begin typing your search above and press return to search.

రాజ్యసభ సీటు కోసమే రూ.100 కోట్ల దావా!

By:  Tupaki Desk   |   12 March 2021 9:30 AM GMT
రాజ్యసభ సీటు కోసమే రూ.100 కోట్ల దావా!
X
ఆరేడు నెలల క్రితం ఒక ప్రముఖ దినపత్రికలో ఒక కథనం వచ్చింది. ఆ మాటకు వస్తే.. అదే అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ రచ్చగా మారింది. ఆ అంశంపై ఏపీ బీజేపీనేతలు కూడా తీవ్రంగా స్పందించారు. జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. కట్ చేస్తే.. ఆ అంశానికి సంబంధించి టీటీడీ ప్రతిష్ఠను డ్యామేజ్ చేసేలా ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తుందని.. అందులో భాగంగా కథనాల్ని ప్రచురించరన్న ఆరోపణతో రూ.100 కోట్ల మొత్తానికి దావా వేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి. ఆయన లాంటి వ్యక్తి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి హడావుడి చేసిన వైనం సంచలనంగా మారింది.

తాను ఏదైనా అంశాన్ని టార్గెట్ చేస్తే.. ఎలా ఉంటుందో తెలుసు కదా? అన్న స్టేట్ మెంట్ తో వాతావరణం మరింత వేడెక్కింది. ఆర్నెల్ల క్రితం మీడియా సంస్థలో ప్రచురించిన కథనం మీద పరువు నష్టం దావా వేయకూడదన్న రూల్ లేదు కానీ.. ఏదైనా చేస్తే వెంటనే స్పందిస్తారు. మరీ.. ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించినట్లు ? అన్నది ప్రశ్న. అంతేకాదు.. ఇదే అంశంపై మిగిలిన మీడియా సంస్థలు కథనాలు అచ్చేసినా వారి మీద ఎలాంటి దావాలు లేకపోవటం ఇప్పుడు చర్చగా మారింది.

అన్నింటికి మించి.. ఇదే అంశంపై ఏపీ బీజేపీనేతలు తీవ్రంగా స్పందిస్తే.. అదే పార్టీకి చెందిన సుబ్రమణ్య స్వామి మాత్రం.. కథనాలు అచ్చేసిన పత్రిక మీద రూ.100 కోట్లకు దావాలు వేయటం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఛౌర్మన్ గురునాథం ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం త్వరలో (2022)ముగుస్తుందని.. తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం కోసమే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థకు మధ్యనున్న విభేదాల గురించి అందరికి తెలిసిందే. దీంతో.. ఆంధ్రజ్యోతిని స్వామి లాంటి లిటిగెంట్ లాయర్ తో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనను సీఎం జగన్ చేసి ఉంటారని.. అందుకే రూ.100 కోట్ల పరువునష్టం దావా వ్యవహారం తెర మీదకు వచ్చినట్లుగా విశ్లేషిస్తున్నారు. స్వామి ట్రాక్ రికార్డు చూస్తే.. ఆయన ఏదైనా విషయాన్ని టేకప్ చేస్తే.. ఆ అంశం లోతుల్లోకి వెళ్లిపోతారు. తాజాగా ఎపిసోడ్ లో కూడా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆంధ్రజ్యోతిని దెబ్బేయటం కోసం స్వామితో ఏపీ సీఎం దావా వేసినట్లుగా కొందరు చెబుతున్నారు. ఇలా చేసినందుకు ప్రతిఫలంగా స్వామికి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ కారణంతోనే రూ.100 కోట్ల దావా తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు.అందులో నిజం ఎంతవరకన్నది కాలమే బదులివ్వాలి.