Begin typing your search above and press return to search.

అటు విరాళం.. ఇటు శ్రీవారి వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం.. త్వ‌ర‌లో కొత్త స్కీం!

By:  Tupaki Desk   |   20 July 2019 5:58 AM GMT
అటు విరాళం.. ఇటు శ్రీవారి వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం.. త్వ‌ర‌లో కొత్త స్కీం!
X
తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం.. కోటి జ‌న్మ‌ల పుణ్య ఫ‌లంగా భావించే హిందువులు.. అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని మ‌రీ తిర‌మ‌ల చేరుకుని అయ్య‌వారి ద‌ర్శ‌నానికి ఎన్నో గంట‌లు వేచి ఉండికూడా.. లిప్త మాత్ర‌పు ద‌ర్శ‌నంతోనే సంతృప్తి చెందుతుంటారు. అయితే, దీనికి భిన్నంగా తిరుమ‌ల‌లో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం అనే ఏర్పాటు ఉంది. ఎంపీలు- ఎమ్మెల్యేలు, ప్ర‌ధాన ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలు, హైకోర్టు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తులు.. రాష్ట్ర‌ప‌తి- ప్ర‌ధాని- ఉప‌రాష్ట్ర ప‌తి ఇలాంటి వారి ద్వారా సిఫార‌సు ప‌త్రాలు తెచ్చిన వారికి లేదా వీరికే వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న్ పేరిట ప్ర‌త్యేకంగా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తున్నారు. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం అనుమ‌తి ఉన్న భ‌క్తులు.. రూ.500 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

వీరికి.. దాదాపు 10 నిమిషాల పాటు స్వామి వారి ముందు నిల‌బ‌డి/ కూర్చుని, త‌న‌వి తీరా.. స్వామి వారి దివ్యమంగ‌ళ స్వ‌రూపా న్ని ద‌ర్శించుకునే వెసులుబాటు ఈ బ్రేక్ ద‌ర్శ‌నం ద్వారా ల‌భిస్తుంది. దీంతో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు రాను రాను భారీ డిమాండ్ పెరిగిపోయింది. దీంతో సాధార‌ణ భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శ‌న స‌మ‌యం రాను రాను త‌గ్గిపోతోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల బ్రేక్ ద‌ర్శ‌నాల‌పై కోర్టు కొర‌డా ఝ‌ళిపించింది. ఏ ప్రాతిప‌దిక‌న ఈ ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తున్నార‌ని ప్ర‌శ్నిం చింది.

అదే స‌మ‌యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు ఈ ద‌ర్శ‌నాల‌ను త‌గ్గిస్తామ‌ని, ఆల‌య బోర్డు ఈవో వైవీ సుబ్బారెడ్డి పేర్కొ న్నారు. ఈ క్ర‌మంలోనే వీఐపీ ద‌ర్శ‌నాల‌కు కోత వేశారు. అయితే, అదే స‌మ‌యంలో సాధార‌ణ భ‌క్తుల‌కు కూడా వీఐపీ ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు. అయితే, దీనికి గాను ప్ర‌పంచ వ్యాప్తంగా తిరుమ‌ల ఆల‌యం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీవేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టుకు రూ. 10 వేల విరాళం ఇస్తే చాలు. ఇలా విరాళం ఇచ్చిన భ‌క్తుల‌కు శ్రీవారి బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ ఇవ్వాల‌ని తాజాగా నిర్ణ‌యించుకున్నారు.

ఎవ‌రి సిఫార‌సు లెట‌రు అవ‌స‌రం లేకుండానే, ఎలాంటి మ‌ధ్య వ‌ర్తుల ప్ర‌మేయం, మోసం జ‌ర‌గ‌కుండానే శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకునే వెసులుబాటు ఉంటుంద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌తిపాద‌న ద‌శ‌లోనే ఉన్న ఈ విధానానికీ సీఎం జ‌గ‌న్ ఆమోద ముద్ర వేస్తే.. వెంట‌నే అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారు. మొత్తానికి బ్రేక్ ద‌ర్శ‌నం.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గానికి కూడా అందుబాటులోకి రానుంది. విరాళం ఇచ్చిన దానికి ఒక పుణ్యం.. బ్రేక్ పేరిట శ్రీవారి సంపూర్ణ ద‌ర్శ‌నం రెండూ ల‌భించ‌నున్నాయ‌న్న మాట‌.