Begin typing your search above and press return to search.

వైద్యులపై దాడి చేస్తే ఖతమే..ఏడేళ్ల జైలు!

By:  Tupaki Desk   |   22 April 2020 12:11 PM GMT
వైద్యులపై దాడి చేస్తే ఖతమే..ఏడేళ్ల జైలు!
X
కరోనా రక్కసి వేళ ప్రాణాలు ఫణంగా పెట్టి మన కోసం వైద్యులు పోరాడుతున్నారు. వారి కోసం ఏమీ చేసిన తక్కువే. అలాంటి వైద్యులపై కొందరు కరోనా రోగుల బంధువులు దాడులు చేస్తున్న ఘటనలు దేశంలో పెరిగిపోతున్నాయి. ఆపద్భాంధవులపై దాడులతో వారు స్థైర్యం కోల్పోయి ఆందోళన బాట పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్య సిబ్బంది రక్షణ కోసం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వైద్యులపై ఇక దాడి చేస్తే ఘటన తీవ్రతను బట్టి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వివరించారు.

వైద్యులపై దాడి చేస్తే తీసుకునే చర్యలపై ఇదివరకు అమల్లో ఉన్న ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 చట్టానికి సవరణలు చేశామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే చట్టం అమలు కానుంది. వైద్యుల రక్షణకు భరోసా లభించనుంది.

ఆస్పత్రులు, క్లినిక్ లపై దాడి చేస్తే ముక్కుపిండి జరిమానా వసూలు చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. అంతేకాదు నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

వైద్యులపై దాడి చేస్తే తీవ్రతను బట్టి 3 నెలల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష.. దాంతోపాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. దాడిచేసిన వారికి సంబంధించి 30 రోజుల్లో విచారణ పూర్తిచేసి, ఏడాదిలోపు జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక విధుల్లో ఉన్న వైద్యసిబ్బందికి రూ.50లక్షల వరకు జీవిత బీమా అందిస్తామని కేంద్రమంత్రి జవదేకర్ తెలిపారు.