Begin typing your search above and press return to search.

ఒక్కరోజే: బిగ్ బజార్ ‘ఏటీఎం’లా పని చేస్తుందట

By:  Tupaki Desk   |   23 Nov 2016 4:13 AM GMT
ఒక్కరోజే: బిగ్ బజార్ ‘ఏటీఎం’లా పని చేస్తుందట
X
నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలు పడుతున్న కష్టాలు అన్నిఇన్ని కావు. రెండు మూడు రోజులు.. మహా అయితే ఒక వారం రోజులు మాత్రమే చిల్లర కష్టాలు అనుకున్నప్పటికీ.. అంతకు మించి అన్న చందంగా గడిచిన రెండు వారాలుగా అవస్థలు తప్పని దుస్థితి. ఏటీఎంలు.. బ్యాంకింగ్ సేవల కోసం జనాలు భారీ క్యూలలో గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల సహనానికి పరీక్షగా మారిన ఈ క్యూలతో.. మోడీ నిర్ణయాన్ని మొదట సమర్థించిన వారు సైతం మనసు మార్చుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే.. మోడీ తీసుకున్న నిర్ణయాన్ని బాసటగా నిలిచేందుకు చాలా రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయటంతో ఈ సమస్య మరింత పెద్దదిగా మారిందని చెప్పాలి.

ఏదైనా విపత్తు వచ్చినప్పుడు పెద్దన్న లాంటి కేంద్రాన్ని సాయం కోసం అర్థించే రాష్ట్ర ప్రభుత్వాలు.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. వీలైనంతవరకూ ప్రజలకు కష్టాలు ఎదురుకాకుండా.. తమ వంతు సాయం అన్న చందంగా వ్యవహరించి ఉంటే.. ఇంత భారీగా కష్టాలు ఉండేవి కాదని చెప్పక తప్పదు. రద్దు నిర్ణయంతో తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు.. బ్యాంకుల వద్ద భారీగా నెలకొన్నక్యూలను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్న వైనం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. కొన్ని సంస్థలు మాత్రం ఇందుకు భిన్నంగా తాము చేయగలిగినంత అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అలాంటి నిర్ణయాన్నే తాజాగా ‘‘బిగ్ బజార్’’ తీసుకుంది. దేశంలోని ప్రజానీకం ఎదుర్కొంటున్న చిల్లర కష్టాల్ని తీర్చేందుకు తన వంతుగా అన్నట్లు.. ఈ నెల 24 అంటే.. గురువారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్ స్టోర్లకు వెళ్లి.. తమ డెబిట్ కార్డుతో రూ.2వేల వరకూ నగదు విత్ డ్రా చేసుకునే వీలును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లోనూ డెబిట్ కార్డులతో నగదు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని చూసి స్ఫూర్తి పొందిందో.. లేక జనాలు పడుతున్న పాట్లను కొంత మేర పరిష్కరించటంతో పాటు.. బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆలోచించిందో కానీ.. బిగ్ బజార్లో డెబిట్ కార్డులతో రూ.2వేలు నగదును తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక్కరోజు మాత్రమే అమల్లో ఉండే ఈ ఆఫర్ తో బిగ్ బజార్ స్టోర్లు అన్ని వన్ డే ఏటీఎం మెషిన్లు మాదిరి మారనున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/