Begin typing your search above and press return to search.

బాత్రూంలో వజ్రాలు.. టైల్స్ కింద నోట్లకట్టలు

By:  Tupaki Desk   |   17 Aug 2015 11:10 AM GMT
బాత్రూంలో వజ్రాలు.. టైల్స్ కింద నోట్లకట్టలు
X
ఆ అధికారికి నెలకు జీతం రూపంలో వచ్చే మొత్తం రూ.45వేల వరకూ ఉంటుంది. పాతికేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడే రూ.45వేల వస్తుంటే.. గతంలో ఎంత మొత్తం వచ్చేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అతగాడి మీద అవినీతి ఆరోఫనలు రావటంతో.. అతనింటిపై ఏసీబీ అధికారులు దాడి చేసి.. సోదాలు నిర్వహించారు.

ఒక సాదాసీదా అధికారి ఇంట్లో బయటపడిన వస్తువుల్ని చూసిన వారికి కళ్లు తిరిగినంతపనైంది. సినిమాల్లో మాదిరి బయటపడుతున్న నోట్ల కట్టలు.. వజ్రాలు చూసిన వారికి షాక్ మీద షాక్ తగులుతూ నోటి వెంట మాట రాకుండా పోతోంది. భారీ మొత్తంలో అవినీతి సొమ్మును వెలికి తీసిన ఈ అపర అవినీతిపరుడి ఉదంతం పశ్చిమబెంగాల్ లో బయటపడింది.

ఈ రాష్ట్రంలోని హౌరా జిల్లాలోని బాలీ ప్రాంతానికి చెందిన ప్రణబ్ అనే ఇంజనీర్ ను ఆయన కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి ఇంటిని సోదాలు చేసిన ఏసీబీ అధికారుల నోటికి మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే.. అంత పెద్ద మొత్తంలో సొత్తు బయటపడటమే.

ఇంట్లోని టైల్స్ కింద రూ.500.. రూ.వెయ్యి నోట్ల కట్టలు బయటపడితే.. బాత్రూంలో విలువైన వజ్రాలు బయటకు వచ్చాయి. ఇంట్లోని టైల్స్ కింద భాగంలోనే కాదు.. బాత్రూంలోని టైల్స్ కింద ప్రత్యేకంగా ఱూ.500.. రూ.1000కోట్లను చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంట్లో బయటపడిన నగదు వరకే దాదాపు రూ.24కోట్లుగా లెక్క తేల్చారు. ఇవి కాకుండా బంగారం.. వజ్రాలు.. ఇతర ఆస్తులు భారీగానే బయటపడ్డాయి. వీటికి సంబంధించిన లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.

మిగిలిన అధికారుల మాదిరే.. ఇతగాడు కూడా తాను నీతిగా.. నిజాయితీ ఉంటానని.. తనకు జీతంగా వచ్చే డబ్బులతో.. తానీ సంపదను సృష్టించినట్లు చెబుతున్నారు. మరి.. ఈ అవినీతి అనకొండకు సంబంధించిన ఆస్తులన్నీ లెక్కేస్తే మరెంత మొత్తంలో ఆస్తులు లెక్క తేలుతాయో..?