Begin typing your search above and press return to search.

నోట్ల ర‌ద్దు లాభ‌మంతా..ఈ గుజ‌రాతీ బ్యాంకుల‌కే

By:  Tupaki Desk   |   23 Jun 2018 5:18 AM GMT
నోట్ల ర‌ద్దు లాభ‌మంతా..ఈ గుజ‌రాతీ బ్యాంకుల‌కే
X
పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడికి సంబంధించి దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. సహకార బ్యాంకుల ద్వారా వందల కోట్ల డబ్బు డిపాజిట్లుగా మారిందని స్పష్టమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా డైరెక్టర్‌ గా ఉన్న అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఏకంగా రూ.745.58 కోట్ల డబ్బు వచ్చిచేరినట్లు బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తుకు సాక్షాత్తూ నాబార్డ్ అధికారులే ఈ సమాచారాన్ని అందజేయడం గమనార్హం. అయితే ఇది ఇంతటితోనే ఆగలేదని, నోట్ల రద్దు తర్వాత కేవలం ఐదురోజుల్లోనే.. గుజరాత్‌లోని 11 బ్యాంకుల్లో సుమారు రూ.3,118కోట్ల విలువైన రద్దు చేసిన నోట్లు డిపాజిట్ అయ్యాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ బ్యాంకుల పాలకమండళ్లకు బీజేపీ నేతలే చైర్మన్లుగా - డైరెక్టర్లుగా ప్రత్యక్షసంబంధాలు కలిగి ఉన్నారని, వారు పకడ్బందీగా నల్లధనాన్ని బ్యాంకుల్లోకి మళ్లించి తెల్లగా మార్చుకున్నారని ప్రధాన ప్రతిపక్షం విమర్శించింది. స్వాతంత్య్రం తర్వాత దేశం చూసిన అతిపెద్ద కుంభకోణం నోట్ల రద్దేనని విరుచుకుపడింది. ఇందుకు త‌గిన‌ట్లుగా ప‌లు అంశాల‌ను ఆ పార్టీ బ‌య‌ట‌పెట్టింది.

గుజరాత్ బ్యాంకులు.. బీజేపీ లింకులు

కాంగ్రెస్ శుక్రవారం విడుదల సమాచారం ప్రకారం.. అహ్మదాబాద్ - రాజ్‌ కోట్ డీసీసీబీలు కాకుండా.. భారీగా డిపాజిట్లు స్వీకరించిన మరో 9 గుజరాత్ సహకార బ్యాంకులతో - బీజేపీతో సంబంధాలు ఇలా ఉన్నాయి..

-సూరత్ జిల్లా సహకార బ్యాంక్: ఇందులో రూ.369.85 కోట్ల విలువైన రద్దయిన నోట్లు డిపాజిట్ అయ్యాయి. బీజేపీ నేత నరేశ్‌ భాయ్ పటేల్ డీసీసీబీ చైర్మన్ కాగా, బర్దోలి ఎంపీ ప్రభుభాయ్ వాసవ డైరెక్టర్‌ గా ఉన్నారు.

-సబర్‌కాంఠా జిల్లా సహకార బ్యాంక్: బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్రసింగ్ చావ్డా - డయ్యూడమన్ అడ్మినిస్ట్రేటర్‌ గా కేంద్రం నియమించిన ప్రఫుల్ ఖోడా పటేల్ దీని డైరెక్టర్లు. ఇక్కడ రూ.328.50 కోట్లు డిపాజిట్ అయ్యాయి.

-బనస్‌కాంఠా జిల్లా సహకార బ్యాంక్: రూ.295.30కోట్ల విలువ చేసే నోట్లు డిపాజిట్ అయ్యాయి. బీజేపీ నేత ఎంఎల్ చౌదరి దీనికి చైర్మన్ కాగా - బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌ చౌదరి డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.

-మెహసానా జిల్లా సహకార బ్యాంక్: ఈ డీసీసీబీ పాలకమండలికి ఎన్నికలు జరుగాల్సి ఉంది. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ రిజిస్ట్రార్ ద్వారా ఈ బ్యాంకును నడిపిస్తున్నారు. ఇక్కడ 215.44కోట్లు డిపాజిట్ అయ్యాయి.

-అమ్రేలి జిల్లా సహకార బ్యాంక్: నోట్ల రద్దు తర్వాత రూ.205.31కోట్లు ఇక్కడ డిపాజిట్ అయ్యాయి. బీజేపీ మాజీ ఎంపీ - ప్రస్తుతం నాఫెడ్ వైస్‌ చైర్మన్‌ గా ఉన్న దిలీప్‌ భాయ్ సంఘాని ఈ డీసీసీబీకి చైర్మన్.

-భరూచ్ జిల్లా సహకార బ్యాంక్: కేవలం ఐదురోజుల్లోనే రూ.98.86కోట్లు డిపాజిట్లుగా వచ్చి చేరాయి. బీజేపీ ఎమ్మెల్యే అరుణాసింహ్ రాణా దీనికి చైర్మన్.

-బరోడా జిల్లా సహకార బ్యాంక్: నోట్లరద్దు తర్వాత రూ.76.38కోట్ల డిపాజిట్లను స్వీకరించింది. బీజేపీ నేత అతుల్‌భాయి పటేల్ చైర్మన్‌ గా - ఎమ్మెల్యే సతీశ్‌ భాయ్ పటేల్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.

-జునాగఢ్ జిల్లా సహకార బ్యాంక్: రూ.59.98కోట్లు డిపాజిట్లు పొందింది. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జాషాభాయ్ బరాద్ ఈ బ్యాంక్ అధ్యక్షుడు.

-పంచ్‌ మహల్ జిల్లా సహకార బ్యాంక్: రూ.30.12కోట్ల డిపాజిట్లను స్వీకరించింది. పాలకమండలి ఎన్నికలు జరుగాల్సి ఉండగా, మాజీ ఎంపీ గోపాల్‌ సింహ్ సోలంకి రిజిస్ట్రార్ ద్వారా బ్యాంకును నడిపిస్తున్నారు.