Begin typing your search above and press return to search.

నల్లనోట్ల మార్పిడికి విమానాల్ని వాడేస్తున్నారు

By:  Tupaki Desk   |   25 Nov 2016 7:36 AM GMT
నల్లనోట్ల మార్పిడికి విమానాల్ని వాడేస్తున్నారు
X
శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అని ఊరికే అనలేదేమో. తాజాగా నోట్ల రద్దు నేపథ్యంలో తెరపైకి వస్తున్న ఉదంతాలు వింటుంటే అవాక్కు అవ్వాల్సిందే. సామాన్యుడ్ని మోడీ తన నిర్ణయాలతో కష్టపెట్టారని.. పెద్దనోట్ల రద్దు సందర్భంగా ఆంక్షల్ని విధించకుండా నోట్లను ఫ్రీ ప్లో చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా? అని విరుచుకుపడుతూ ప్రశ్నించే వారు చాలామందే కనిపిస్తారు.

ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే దాని నుంచి బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకునే వరకూ ఇన్నేసి ఆంక్షలు ఉన్నప్పటికీ.. ఎంతో మంది ఎన్నో విధాలుగా తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాల ముచ్చట తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొంతమంది బడాబాబులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని వైట్ గా మార్చేసేందుకు ఏకంగా విమానాల్ని రంగంలోకి దించేస్తున్నారు.

హర్యానా నుంచి నాగాలాండ్ కి భారీ ఎత్తున పాత నోట్లను తరలిస్తున్న ఒక విమానాన్ని అధికారులు అదుపులోకి తీసుకోవటం.. పెద్దనోట్లను భారీగా స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. ఎందుకిలా అంటే దాని లెక్క వేరని చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన నాగాలాండ్.. మణిపూర్.. త్రిపుర.. అరుణాచల్ ప్రదేశ్.. మిజోరం.. లఢాఖ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని గిరిజన తెగలకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంది. వారి ఆదాయానికి ఎలాంటి పన్నులు ఉండవు.

దీంతో.. అలాంటి వారికి నగదును బదిలీ చేసి.. వారి ద్వారా తమ నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు కొందరు నేతలు రంగంలోకి దిగారు. ఇలాంటి వారు తమ దగ్గరున్న భారీ నల్లధాన్ని ఎంతో ప్లానింగ్ తో వైట్ గా మార్చేందుకు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సవాలచ్చ యవ్వారాలు వెలుగు చూస్తున్నవేళ.. కాసింత సందు దొరికినా వదలని వారు.. అన్నింటిని ఫ్రీగా వదిలేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మోడీని.. ఆయన చేపట్టిన అవినీతి ప్రక్షాళన కార్యక్రమాన్ని విమర్శించే వారు.. ఇలాంటి వాస్తవాల్నిఎందుకు పరిగణలోకి తీసుకోరన్నది ప్రశ్న.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/