Begin typing your search above and press return to search.

కాసులు కురిపించిన క్లిక్ ముంచేసింది

By:  Tupaki Desk   |   2 Feb 2017 4:31 PM GMT
కాసులు కురిపించిన క్లిక్ ముంచేసింది
X
ఉత్తపుణ్యానికే డబ్బులు ఎవరూ ఇవ్వరు. కానీ.. ఊరికే డబ్బులు వస్తున్నాయన్న మౌత్ పబ్లిసిటీతో వేలాది కోట్లను దోచేసి మోసం చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. గడిచిన కొద్ది నెలలుగా క్లిక్ తో కాసులు పేరుతో ఒక అంశం మీద పెద్ద చర్చ నడుస్తోంది. రోజుకు కేవలం గంట టైమ్ స్పెండ్ చేసి.. క్లిక్కుల మీద క్లిక్కులు కొడితేచాలు.. నెలకు తక్కువలో తక్కువ రూ.10వేలు వస్తాయంటూ ఊరించిన వైనం ఇప్పుడెంత మోసమన్నది బయటకు వచ్చింది.

ఊరికేడబ్బులు ఎవరూ ఇవ్వరన్న మాటను చెప్పిన చాలామందిని పిచ్చోళ్ల మాదిరి చూస్తే.. మాయాజాలంలో పడిన వారంతా ఇప్పుడు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇంతకీ ఈ క్లిక్కులేంది? కాసులేంది? ఈ లెక్కేంది? రూ.3700 కోట్లు దోచేయటం ఏమిటి? అన్నవిషయాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సెక్టార్ 63లో అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటి ఉంది.

ఈ కంపెనీ ఆన్ లైన్ ట్రేడింగ్ అంటూ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించి లక్షలాది మందిని ఊరించేసింది. ఈ కంపెనీ చెప్పే ఆకర్షణీయమైన పథకంలో చేరాలనుకునే వారు తొలుత రూ.57,500 కట్టాల్సి ఉంటుంది. నిత్యం వారు కొన్ని లింకులు పంపుతారు. వాటిని క్లిక్ చేసి.. కొన్ని సెకండ్ల పాటుసదరు లింకులో ఉండాలి. ఇలా చేసే ప్రతి క్లిక్కు రూ.5 చొప్పున మొత్తాన్ని ఇస్తారు.

ఇలా క్లిక్కులు చేస్తూనే.. మరికొందరిని చేరుస్తూ పోతే.. వారికి వచ్చే మొత్తం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. ఇలా డబ్బులు కట్టి చేరిన చాలామందికి మొదట్లో రూ.10వేల నుంచి రూ.50వేల వరకూ వచ్చిన పరిస్థితి. దీంతో.. తమకు తెలిసిన వారందరికి చెప్పటం.. వీలైనంత మందిని చేర్పించటం మొదలు పెట్టారు. ఇలా చేర్పించిన వారికి అదనంగా ఆదాయం వచ్చే వెసులుబాటు ఉండటంతో ఎవరికి వారు.. ఈ విధానాన్ని తెలిసిన వారందరికి చెబుతూ.. ప్రమోట్ చేశారు. మొదట్లో ఈ కంపెనీ డబ్బుల్ని బాగానే ఇచ్చింది. దీంతో.. పెద్ద ఎత్తున ఈకంపెనీలో చేరటం మొదలెట్టారు. దిగువ మధ్య తరగతి మొదలుకొని.. ఉన్నత ఉద్యోగులవరకూ ఈ సంస్థలో సభ్యులుగా చేరటం గమనార్హం. ఉత్తినే డబ్బులు వస్తాయన్న ఆశతో కొందరు వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి మరీ చేరినట్లుగా తెలుస్తోంది.

సమయం చూసుకున్న ఈ కంపెనీ నిర్వాహకులు ఇప్పుడు బోర్డు తిప్పేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు సందరు కంపెనీకి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ఉదంతం గురించి మీడియాలో కొన్ని వార్తలు వచ్చినప్పటికీ.. నమ్మని పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామంతో ఈ కంపెనీ మొత్తంగా ప్రజల నుంచి రూ.3700 కోట్లు సేకరించినట్లుగా చెబుతున్నారు. క్లిక్కు కొడితే డబ్బులు వచ్చి పడిపోతాయంటూ అత్యాశకు పొందిన వారంతా ఇప్పుడు లబోదిబో అనే పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/