Begin typing your search above and press return to search.

మీటర్ పనిచేయపోవడంతో రూ.51 వేల బిల్లు

By:  Tupaki Desk   |   17 April 2022 2:30 AM GMT
మీటర్ పనిచేయపోవడంతో రూ.51 వేల బిల్లు
X
విద్యుత్ శాఖ అదికారుల లీలలు అన్ని ఇన్ని కావు. విద్యుత్ బిల్లుల నమోదులో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం వినియోగదారుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. దీంతో మూలిగే నక్కపై మరో పిడుగు అన్నట్లు మారింది.

ఒకవైపు ఆస్తి పన్ను పెంచింది. మరో వైపు విద్యుత్ బిల్లులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రజల నెత్తిన మాత్రం భారం మోపుతోంది.

ప్రకాశం జిల్లా దర్శిలో ఓ వినియోగదారుడు విద్యుత్ మీటర్ పనిచేయడం లేదని సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నాడు కానీ వారు మాత్రం మీటరును సరిచేయలేదు. మరమ్మతు చేయలేదు. దీంతో జూన్ నెల వరకు బిల్లులు చెల్లిస్తూ వచ్చాడు. అప్పటి నుంచి మీటర్ పని చేయకపోవడంతో బిల్లులు రాకపోవడంతో బిల్లులు చెల్లించలేదు.

సంబంధిత బాధితుడు నాగేశ్వర్ రావుకు రెండు బల్బులు, ఒక నీటి మోటారు, రెండు ఫ్యాన్లు ఉపయోగించే ఇంటికి రూ. 51 వేల బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాడు. విద్యుత్ శాఖ అధికారుల తీరుకు ఖంగుతిన్నాడు. దీంతో బిల్లు ఎలా కట్టేది అని ప్రశ్నిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతో ఇంత బిల్లు ఎలా కట్టాలో తెలియడం లేదని వాపోతున్నాడు.

విద్యుత్ శాఖ అధికారుల చోద్యంతో బిల్లులు పెరిగిపోతున్నాయి. ఇంత మొత్తంలో బిల్లు ఎలా చెల్లిస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి ఇంత బిల్లు చెల్లించడం తన వల్ల కాదని మొండికేస్తున్నాడు. దీనిపై అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. మాకేం తెలియదు అని దాటేస్తున్నారు.

సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించారని తెలుస్తోంది. అందుకే ఇంత బిల్లు వచ్చిందని చెబుతున్నారు. మీటర్ పనిచేయడం లేదని చెప్పినప్పుడు సరిచేస్తే నెలనెల బిల్లు చెల్లిస్తే ఇంత దారుణం జరిగేది కాదని బాధితుడు చెబుతున్నాడు. దీనిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.