Begin typing your search above and press return to search.

మార్చిలో వేసే స్పెక్ట్రమ్ వేలంతో ప్రభుత్వానికి రూ.5.22 లక్షల కోట్లు?

By:  Tupaki Desk   |   21 Dec 2019 6:37 AM GMT
మార్చిలో వేసే స్పెక్ట్రమ్ వేలంతో ప్రభుత్వానికి రూ.5.22 లక్షల కోట్లు?
X
ఇప్పుడు చెప్పే అంకెలు విన్నంతనే గుండె గుభేల్ అనటం ఖాయం. అదే సమయంలో దేశంలో మొబైల్ ఫోన్ల వాడకటం.. డేటా వినియోగం అంతకంతకూ పెరిగిపోతున్న వైనాన్ని చెప్పటమే కాదు.. ప్రభుత్వానికి ఎంతలా కాసులు కురిపిస్తున్నాయో చెప్పే వైనం ఒకటి బయటకు వచ్చింది. టెలికాం సర్వీసులకు వినియోగించే స్పెక్ట్రమ్ వేలానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది మార్చిలో 22 సర్కిళ్లలో 8300 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ ను అమ్మాలని కేంద్రం భావిస్తోంది. ట్రాయ్ సూచనలకు ఆమోదం పడిన నేపథ్యంలో ఈ స్పెక్ట్రమ్ వేలంతో ప్రభుత్వానికి ఏకంగా రూ.5.22లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తం భారీగా ఉండటం.. ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని తగ్గించాలని టెలికం కంపెనీలు కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం నో అంటే నో చెప్పేయటం గమనార్హం.

మార్చిలో వేలానికి పెట్టనున్న స్పెక్ట్రమ్ రిజర్వు ధర రూ.5,22,850 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. డేటాకు డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో టెలికాం కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీ ఉంటుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఇంత భారీ మొత్తానికి స్పెక్ట్రమ్ ను అమ్మే ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవంటున్నారు.

ఇప్పటికే టెలికం కంపెనీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ..ఇంత భారీ మొత్తానికి స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేయటానికి ముందుకు రాకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. 5జీ స్పెక్ట్రమ్ ను ఇటీవల అమ్మిన దేశాలతో పోలిస్తే.. తాజాగా మన దగ్గర పెడుతున్న రిజర్వ్ ధర నాలుగు నుంచి ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలంలో పాల్గొనటానికి అవసరమైన నిధులు కంపెనీల వద్ద ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజా వేలంతో తమకు సమకూరే భారీ నిధులతో ఆర్థిక ఇబ్బందులు తీరిపోయే వీలుందంటున్నారు. మోడీ సర్కారు అంచనా వేస్తున్నట్లే ఈ భారీ మొత్తానికి వేలం జరిగితే మాత్రం కేంద్రం కరవు తీరిపోవటం ఖాయమని చెప్పక తప్పదు.