Begin typing your search above and press return to search.

రూ.570 కోట్ల లెక్క తేలిందండోయ్

By:  Tupaki Desk   |   15 May 2016 5:19 AM GMT
రూ.570 కోట్ల లెక్క తేలిందండోయ్
X
తమిళనాడు ఎన్నికల ప్రచార హోరు ఓ రేంజ్ లో సాగుతున్న వేళ.. దేశ వ్యాప్తంగా ఒక వార్త తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. మూడు కంటైనర్లలో రూ.570 కోట్ల మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవటం అందరూ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. సరైన పత్రాలులేకుండా ఇంత భారీ మొత్తాన్ని కంటైనర్లలో తరలిస్తున్న వైనం షాక్ తినేలా చేసింది. తమిళనాడులోని తిరువూరు జిల్లా సింగపల్లి సమీపంలో ప్లయింగ్ స్వ్కాడ్ అధికారులు వాహనాల్ని తనిఖీ చేసే క్రమంలో.. మూడు కంటైనర్లలో ఉన్న వందల కోట్లను చూసి కళ్లు చెదిరిపోయాయి.

ఈ మొత్తాన్ని లెక్క చూస్తే అది రూ.570 కోట్లుగా తేలింది. ఎన్నికల వేళ కావటంతో ఇంత భారీ మొత్తం వెనుక ఏదైనా రాజకీయ పార్టీ హస్తం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఈ డబ్బు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదన్న మాటను అధికారులు మొదట నమ్మలేదు. ఎందుకంటే.. ఈ కంటైనర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వాహనాలు ఆపకుండా వెళ్లటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కంటైనర్లను ఫాలో అవుతున్న మూడు కార్లుసైతం ఆపకుండా ఉండటంతో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. వందలాది కోట్ల సొమ్మున్న కంటైనర్లను ఆపితే భద్రతాపరంగా సమస్యలు ఎదురువుతాయన్న ఉద్దేశంతో తాము వాహనాల్ని ఆపలేదని చెప్పినా అధికారులు మొదట నమ్మలేదు.

అందుకే.. వందలాది కోట్లున్న కంటైనర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు వాటిని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. అనంతరం విచారణ జరిపి అవి చివరకు ఎస్ బీఐకి చెందిన కంటైనర్లుగా గుర్తించారు. కోయంబత్తూరు ఎస్ బీఐ బ్రాంచ్ నుంచి ఏపీలోని విశాఖకు ఈ మొత్తాన్ని తరలిస్తున్నట్లుగా ఎస్బీఐ వెల్లడించింది. ఆర్ బీఐ ఆదేశాల మేరకు కోయంబత్తూరు నుంచి ఏపీ పోలీసుల సెక్యూరిటీతో ఈ మొత్తాన్ని తాము తరలిస్తున్నట్లుగా ఎస్ బీఐ పేర్కొంది. దీంతో.. రూ.570 కోట్లున్న మూడు కంటైనర్ల మీద నెలకొన్న పలు సందేహాలకు సమాధానం దొరికినట్లైంది.