Begin typing your search above and press return to search.

ఏపీలో ఆ శాఖ బదిలీల్లో రూ.70 కోట్ల గోల్ మాల్

By:  Tupaki Desk   |   12 April 2022 11:30 PM GMT
ఏపీలో ఆ శాఖ బదిలీల్లో రూ.70 కోట్ల గోల్ మాల్
X
ఆయన తిరుపతిలో పెద్ద డాక్టర్. ఆయన భార్య కూడా పెద్ద వైద్యురాలు. ఇద్దరూ స్థానికంగా పేరూ, పలుకుబడి ఉన్నవారు. అయితే, ఆ వైద్యుడికి ఇటీవల 100 కిలోమీటర్ల దూరం బదిలీ అయింది. పరిస్థితుల రీత్యా ఆయన అంత దూరం వెళ్లలేని నేపథ్యంలో బదిలీ నిలిపివేతకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి చివరి వరకు పట్టుదల చూపారు. ఆఖరికి రూ.10 లక్షలు ఇచ్చి బదిలీ నిలుపుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ, అదేమీ కుదరలేదు. అంతకంటే ఎక్కువ పెడతానన్నప్పటికీ బదిలీ ఆగలేదు. ఇక్కడ బదిలీ ఆగిందా? ఆగలేదా? అన్నది పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఓ శాఖలో పెద్ద ఎత్తున చేతులు మారిన ఆమ్యామ్యా నగదు రూ.70 కోట్లు వరకు ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ శాఖలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టడంతో అందరి స్థానాలు కదిలిపోయాయి. దీంతో ఒక్కసారిగా తమ ప్రాంతాలను వీడేందుకు ఇష్టం లేక ఉద్యోగులు, అధికారులు, కోరుకున్న స్థానం పొందేందుకు మరికొందరు పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇదిగో.. ఇప్పుడలా చేతులు మారిన మొత్తాన్ని లెక్క తీస్తే రూ.70 కోట్ల వరకు ఉంటుందని తేలింది. ఎప్పటిలాగే కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఇందులో తమవంతు పాత్ర పోషించాయి. కొన్నయితే తీవ్రంగా ఇన్వాల్వ్ అయ్యాయి.

ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు

తప్పనిసరిగా బదిలీ అవుతామని తెలిసిన వారు వేసిన ఎత్తుగడలు అన్నీఇన్నీ కావని చెబుతున్నారు. ఈ క్రమంలోనే లక్షలు అలా అలా చేతులు మారినట్లుగా పేర్కొంటున్నారు. ఇక వారు కోరుకున్న ప్రాంతాన్ని బట్టి.. కేడర్ స్థాయిని బట్టి డిమాండ్ పెరుగుతూ పోయింది. వాస్తవానికి బదిలీ ప్రక్రియ అంతా ఆన్ లైన్ పద్ధతిలో సాగింది.

అయితే, అధికారులు, ఓ వర్గం సిబ్బంది మాత్రం బదిలీ ఆర్డర్ పొందేందుకు, దానిని నిలుపుకొనేందుకు లంచంను నమ్ముకున్నారన్న ప్రచారం ఉంది. ఓవైపు లంచం ఇస్తూనే మరోవైపు పిల్లల చదువు, వివాహాలు, అనారోగ్య కారణాలు తదితరాలు చూపి కొందరు బదిలీ తప్పించుకునేందుకు ప్రయత్నించారనే వాదన ఉంది.

కొవిడ్ కాలంలో పీడించారుగా? పోయేదేముంది?

ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ముఖ్య నేత ఆలోచన భిన్నంగా ఉంది. ఈ శాఖ వారు కొవిడ్ కాలంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బు గుంజారనే ఆరోపణలు ఉన్నాయి. లక్షలకు లక్షలు వెనకేశారనే అభిప్రాయమూ ఉంది. సాధారణ ప్రజలనూ వదలకుండా పీల్చి పిప్పి చేశారనే అపప్రధ మూటగట్టుకున్నారు.

ఇప్పుడు బదిలీలకు, వాటిని నిలుపుకొనేందుకు ఆ డబ్బను బయటకు తీస్తున్నారనే అభిప్రాయం నెలకొంది. కాబట్టి ఈ విషయంలో ఆ శాఖ అధికారులు, సిబ్బంది మీద జాలి చూపాల్సిన పని లేదనే ఉద్దేశం కనిపించింది.