Begin typing your search above and press return to search.

బస్ కండెక్టర్ ఇంట్లో రూ.750 కోట్లు...కర్ణాటక రాజకీయాల్లో కుదుపు !

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:30 PM GMT
బస్ కండెక్టర్ ఇంట్లో రూ.750 కోట్లు...కర్ణాటక రాజకీయాల్లో కుదుపు !
X
బెంగ‌ళూరు మెట్రోపాలిట‌న్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేష‌న్ (బీఎంటీసీ) లో అతడు ఓ సాధారణ బస్ కండెక్టర్. అత‌డి ఇంటిపై ఇటీవ‌ల ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. సాధారణ బస్ కండెక్టర్ ఇంట్లో ఏకంగా 750 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల‌ను గుర్తించిన‌ట్టుగా రైడ్స్ పూర్త‌యిన త‌ర్వాత వార్త‌లు వైరల్ అయ్యాయి. మొత్తం 47 చోట్ల రైడ్స్ నిర్వ‌హించార‌ట. కండ‌క్ట‌ర్ ఎంత చిల్లర వెనుక వేస్తే..అన్ని ఆస్తులు కూడ‌బెట్టాల‌నే సందేహం ఎవ‌రికైనా ఇట్టే వ‌స్తుంది. అయితే ఆ బీఎంటీసీ ఉద్యోగి డిప్యూటేష‌న్ మీద‌, కొన్నేళ్ల పాటు సీఎం కార్యాల‌యంలో ప‌ని చేశాడు.

బీఎంటీసీ నుంచి సీఎం ఆఫీసులో ప‌ని నిమిత్తం అత‌డిని తీసుకున్నారు. అది వ్యూహాత్మ‌కంగానే తీసుకున్నారో లేక తీసుకున్నాకా క‌థ మారిందో కానీ, ఎంఆర్ ఉమేష్ అనే బీఎంటీసీ ఉద్యోగి ఇంటిపై ఇటీవ‌ల నిర్వ‌హించిన ఐటీ రైడ్స్ లో 750 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల‌ను గుర్తించారు. ఇందులో భారీ డబ్బు, బంగారం కూడా ఉంది. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం అటు తిరిగి, ఇటు తిరిగి క‌ర్ణాట‌క రాజ‌కీయాన్నే కుదిపి వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఉమేష్ పై ఐటీ రైడ్స్ తో ఏకంగా య‌డియూర‌ప్ప‌, సిద్ధ‌రామ‌య్య‌లు చేతులు క‌లిపే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే య‌డియూర‌ప్ప‌, సిద్ధరామ‌య్య‌లు ఒక‌సారి స‌మావేశం కూడా అయ్యారంటూ మ‌రో మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ఆరోపించారు.

అయితే ఆ ఆరోప‌ణ‌ల‌ను సిద్ద‌రామ‌య్య ఖండించారు. త‌ను య‌డియూర‌ప్ప‌తో స‌మావేశం అయిన‌ట్టుగా నిరూపిస్తే త‌ను రాజ‌కీయాల నుంచి వైదొలుగుతానంటూ ఆయ‌న స‌వాల్ విసిరారు. ఉమేష్ అనే ఆ బీఎంటీసీ ఉద్యోగి సీఎం కార్యాల‌యంలో ప‌ని చేస్తూ కొన్ని స్కాముల్లో కీల‌క పాత్ర పోషించాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌త్యేకించి య‌డియూర‌ప్ప సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఈ చిరుద్యోగి చాలా పెద్ద ప‌నులు చేశాడ‌ని, య‌డియూర‌ప్ప‌కు స‌హాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ స్కామ్ ల‌లో ప్ర‌ధాన పాత్ర పోషించాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత‌డు చేయ‌గ‌లిగింది బినామీ పాత్రే కావొచ్చు.

య‌డియూర‌ప్ప త‌న‌యుడు విజ‌యేంద్ర తో ఉమేష్ కు సంబంధాలున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. విజ‌యేంద్ర‌, ఉమేష్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఒక స్కామ్ కు య‌డియూర‌ప్ప త‌న‌వంతు స‌హ‌కారం అందించార‌నే ఆరోప‌ణ‌లను బీజేపీనేత‌లు కూడా గ‌తంలో హైలెట్ చేసిన దాఖ‌లాలున్నాయి. విశేషం ఏమిటంటే, క‌ర్ణాట‌క‌కు ఇటీవ‌ల సీఎంగా బొమ్మై బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత కూడా ఉమేష్ సీఎం కార్యాల‌యంలోనే ప‌ని చేస్తూ వ‌చ్చాడ‌ట‌. ఐటీ రైడ్స్ త‌ర్వాత మాత్రం, ఉమేష్ డిప్యూటేష‌న్ ను ర‌ద్దు చేసి బీఎంటీసీ వెన‌క్కు పిలిపించుకుంది. ఈ వ్యవహారంతో ఇప్పుడు కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి.