Begin typing your search above and press return to search.

ఐదు నెల‌ల్లో బీజేపీ ఖాతాలో రూ. 80,000 కోట్లు

By:  Tupaki Desk   |   15 Dec 2017 5:34 PM GMT
ఐదు నెల‌ల్లో బీజేపీ ఖాతాలో రూ. 80,000 కోట్లు
X
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నాహ‌జారే మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేశారు. ఇటు ప్ర‌ధానిని, అటు బీజేపీని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వారికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో తాను గత మూడేళ్లుగా మౌనంగా ఉన్నానని పేర్కొంటూ ఇప్పుడు ఆయా అంశాల‌పై మాట్లాడే స‌మయం వ‌చ్చింద‌ని హ‌జారే స్పష్టం చేశారు.

సామాన్య ప్ర‌జ‌లు, రైతులు ఓ వైపు ఆవేద‌న‌లో ఉంటే...మ‌రోవైపు పాల‌న‌లో అవినీతి పెద్ద ఎత్తున జ‌రుగుతోంద‌ని అన్నాహ‌జారే ఆరోపించారు. మూడేళ్ల ఎన్డీఏ పాలనలో ఆసియాలోని అవినీతి దేశాల్లో ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉందని హ‌జారే వివ‌రించారు. కేవలం ఐదు నెలల్లో బీజేపీకి విరాళాల ద్వారా రూ.80,000 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఈ విష‌యం తాను వెల్ల‌డించ‌లేద‌ని...స్వయానా ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింద‌ని వివ‌రించారు. మోడీ స‌ర్కారు అవినీతిని పెంచి పోషించే ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంద‌ని హ‌జ‌రే విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ అధికారులు తమ ఆస్తులను తప్పనిసరిగా ప్రకటించాలనే నిబంధ‌న ఉండ‌గా... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సర్కార్ దాన్ని ఎత్తివేసింద‌ని హ‌జారే మండిప‌డ్డారు. దీంతోపాటుగా కంపెనీలు తమ లాభాల్లో 7.5 శాతం పార్టీలకు విరాళంగా ఇచ్చేందుకు మాత్రం అవకాశం ఇచ్చారని...ఇప్పుడు ఎంత డబ్బయినా రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చని హజారే మండిప‌డ్డారు. ఈ చ‌ర్య‌లు అవినీతి పెరిగేందుకు బాట‌లు వేశాయ‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుత ప‌రిపాల‌న‌లో సామాన్య ప్రజలు, రైతులు అంతా బాధితులేన‌ని అన్నాహ‌జారే ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బ్యాంకుల‌కు దక్కుతున్న రుణాల గురించే మాట్లాడుతూ బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తున్నప్ప‌టికీ...తమ ఇష్టమొచ్చినట్టుగా వడ్డీలు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. రైతులకు బ్యాంకులు ఇచ్చేరుణాలపై ఆర్బీఐ కచ్చితమైన వడ్డీరేట్లు ఖ‌రారు చేయాలని హజారే డిమాండ్ చేశారు. రూతులు,, ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం విప్పుతూ 32 లేఖ‌లు రాశాన‌ని హజారే వెల్ల‌డించారు. రైతుల కోసం శక్తివంతమైన జన్‌ లోక్‌పాల్ తీసుకువచ్చేందుకు మార్చి 23 నుంచి మరో మహోద్యమం ప్రారంభించబోతున్నానని ఆయ‌న వెల్ల‌డించారు. అందర్నీ కలుపుకొని ఉద్యమిస్తానని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని ఈ సంద‌ర్భంగా అన్నాహ‌జారే తేల్చిచెప్పారు. `మమ్మల్ని జైలుకు పంపుతామంటే దేశ ప్రజలతో జైళ్లు నిండిపోతాయని చెబుతాం` అంటూ త‌న కార్యాచ‌ర‌ణ‌ను అన్నాహజారే స్ప‌ష్టం చేశారు.