Begin typing your search above and press return to search.

తెలంగాణ డీజీపీకి రూ.90 లక్షల పరిహారం.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   16 April 2022 9:30 AM GMT
తెలంగాణ డీజీపీకి రూ.90 లక్షల పరిహారం.. ఎందుకో తెలుసా?
X
తెలంగాణ రాష్ట్ర పోలీసు బాసు.. డీజీపీ మహేందర్ రెడ్డి భారీగా పరిహారం పొందబోతున్నారు. అది కూడా ఏకంగా రూ.90 లక్షలను ఆయనకు ప్రభుత్వం చెల్లించబోతోంది. ఇదంతా మహేందర్ రెడ్డి సర్వీసు సేవలకు సంబంధించి కాదు... సొంత జిల్లా ఖమ్మంలో ఆయనకు వారసత్వంగా వచ్చిన భూమిని కోల్పోతున్నందుకు కావడం విశేషం. ఈ మొత్తం 90 లక్షల రూపాయిలు మరికొద్ది రోజుల్లోనే డీజీపీ మహేందర్ రెడ్డి ఖాతాలో జమ కానున్నాయి. ఇంత పెద్దమొత్తంలో పరిహారం పొందనుండడం వెనుక ఓ పెద్ద ప్రాజెక్టు ఉన్నది.

సీతారామ.. ఖమ్మం మణిహారం

గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో తెలంగాణ ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే భద్రాచలం రాముల వారే గుర్తుకు వస్తారు. రాముడి గడ్డ గానూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పేరు. తెలంగాణలో ఉన్నప్పటికీ.. అనేక విధాలుగా ఆంధ్రాతో దగ్గరి సంబంధాలున్న జిల్లా ఇది. అంతేకాదు.. అటవీ సంపద, సింగరేణి సిరులు, వ్యాపార, వాణిజ్య హంగులు కలగలిసి అలరారే జిల్లాగా ఉమ్మడి ఖమ్మంకు పేరు.

అంతేకాదు.. భద్రాద్రి రాముడిని ఈ జిల్లా ప్రజలు ఇష్ట దైవంగా భావిస్తారు. రాములోరి కల్యాణాన్ని ‘‘దేవుడి పెళ్లిగా’’ఘనంగా జరుపుకొంటారు. ఆ సెంటిమెంటును గౌరవిస్తూ.. ప్రభుత్వం సైతం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సీతారామ ఎత్తిపోతలుగా పేరు పెట్టింది. అశ్వాపురం మండలంలో గోదావరి నది నుంచి నీటిని తోడి కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలోకి తరలిస్తారు.

4 ఎకరాలు కోల్పోతున్న డీజీపీ

సీతారామ ఎత్తిపోతల ద్వారా అశ్వాపురం నుంచి తరలించిన నీరు పాలేరు జలాశయంలోకి చేరే క్రమంలో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. పాలేరు లింక్ ప్రధాన కాలువ 16వ ప్యాకేజీలో పాలేరు జలాశయానికి సమీపంలో డీజీపీ మహేందర్ రెడ్డికి చెందిన మామిడి తోట నుంచి కాలువ తవ్వాల్సి ఉంది. ఇది డీజీపీకి పూర్వీకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి. ఇలా వచ్చిన 4.35 ఎకరాల భూమిని డీజీపీ.. సీతారామ ప్రాజెక్టు కోసం కోల్పోతున్నారు. కూసుమంచి రెవెన్యూ గ్రామం సర్వే నంబరు 924లో ఈ భూమి ఉంది. ప్రాజెక్టు కోసం ఈ భూమిని గతంలోనే ప్రభుత్వం సేకరించింది.

డీజీపీ తమ్ముడికి రూ.15 లక్షలు

సీతారామలో భూమిని కోల్పోయిన చాలామంది రైతులకు ప్రభుత్వం పరిహారం ఇస్తోంది. ఇందులో భాగంగా భూమికి సంబంధించిన పరిహారం రూ.90,18,250 డీజీపీ మహేందర్ రెడ్డి ఖాతాలో నాలుగైదు రోజుల్లో జమ కానున్నట్లు సమాచారం. కాగా, డీజీపీ మహేందర్ రెడ్డి లాగా ఆయన సోదరుడు నర్సింహారెడ్డి సైతం సీతారామ ప్రధాన కాలువ తవ్వకంలో కొంత భూమిని కోల్పోతున్నారు. దీనికి సంబంధించి ఆయన రూ.15 లక్షలు పరిహారం అందనున్నట్లు సమాచారం. ఇదీ.. డీజీపీకి ప్రభుత్వం అందించనున్న పరిహారం కథ.