Begin typing your search above and press return to search.

అక్క‌డి నుంచి ఆర్ఎస్ పోటీ!?

By:  Tupaki Desk   |   6 Jan 2022 7:37 AM GMT
అక్క‌డి నుంచి ఆర్ఎస్ పోటీ!?
X
బ‌హుజ‌నాల ప‌క్షాన పోరాడేందుకు రాజకీయాల్లోకి వ‌చ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నే చ‌ర్చ ఇప్ప‌టి నుంచే జోరుగా సాగుతోంది. ఆయన ఎక్క‌డి నుంచి బ‌రిలో దిగుతారో అనే ప్ర‌శ్న‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. అయితే ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గం మాట‌ల ప్ర‌కారం ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని తుంగ‌తుర్తి నుంచి పోటీ చేసేందుకు ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికే అక్క‌డ ఆయ‌న ఓ ఇల్లు కూడా అద్దెకు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇంకా ప‌ద‌వీ కాలం ఉన్న‌ప్ప‌టికీ హుజ‌రాబాద్ ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌వీణ్ కుమార్‌ త‌న ప‌ద‌వికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకోవ‌డంతో టీఆర్ఎస్‌లో చేర‌తార‌నే ప్ర‌చారం సాగింది. కానీ అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కురిపిస్తూ ఆయ‌న బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. అంతే కాకుండా ఆ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేట‌ర్‌గా నియ‌మితులై తెలంగాణ‌లో పార్టీని న‌డిపిస్తున్నారు. బ‌హుజ‌నుల‌కు అధికార‌మే నినాదంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తున్నారు. ప్ర‌జ‌ల్లో ఉంటూ ఆందోళ‌న‌లు నిర‌స‌న‌లు చేస్తున్నారు.

రాజ‌కీయాల్లో ప్ర‌వీణ్ కుమార్ యాక్టివ్‌గా ముందుకు సాగ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌నే ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న‌ది ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా. ఆయ‌న పుట్టిన ఊరు అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. దీంతో ఆయ‌న అక్క‌డి నుంచే పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌వీణ్‌కుమార్ ఆస‌క్తి చూప‌డం లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు అంటున్నారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని తుంగ‌తుర్తి నుంచి బరిలో దిగాల‌ని ప్ర‌వీణ్ చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన తుంగ‌తుర్తి గ‌తంలో కమ్యూనిస్టుల కంచుకోట‌గా ఉండేది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ ఈ ప్రాంతానికి ప్ర‌త్యేక పాత్ర ఉంది.

రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌గా ఉన్న తుంగ‌తుర్తి నుంచి పోటీ చేస్తే బాగుంటుంద‌ని ప్ర‌వీణ్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ దిశ‌గా ఇప్ప‌టికే ఆయ‌న స‌న్నిహితులు, స్వేరోస్ బృందాలు తుంగ‌తుర్తిలో ప్ర‌వీణ్ గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిసింది. వాళ్లు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నార‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. అయితే అక్క‌డ ఆయ‌న విజ‌యం సాధించ‌డం అంత సులువు కాదు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు అక్క‌డ గాద‌రి కిశోర్ గెలిచారు. మ‌రోవైపు కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఆయ‌న మ‌రోసారి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇంకోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ గాయ‌కుడు ఏపూరి సోమ‌న్న తుంగ‌తుర్తి నుంచి పోటీ చేస్తార‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తీవ్ర‌మైన పోటీని త‌ట్టుకుని ప్ర‌వీణ్ కుమార్ ఏ రక‌మైన ఫ‌లితాలు సాధిస్తాడో చూడాలి.