Begin typing your search above and press return to search.

ముస్లిం పోలీసులు మాకొద్దు

By:  Tupaki Desk   |   8 May 2016 7:13 AM GMT
ముస్లిం పోలీసులు మాకొద్దు
X
ప్రముఖుల భద్రత - రక్షణ పోలీసుల విధి. దానికి కులమతాల ప్రమేయం ఉండదు. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ ఎస్‌ ఎస్‌)కు మాత్రం ముస్లిం పోలీసులు భద్రతా విధి నిర్వహణకు పనికిరారట. తమకు భద్రతగా ముస్లిం పోలీసులు వద్దంటూ వెనక్కు పంపేసిన ఘటన అనంతపురం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆరెస్సెస్ చీఫ్ భద్రత కోసం నలభై మంది పోలీసులు రాగా వారిని పేరుపేరునా పరిశీలించి ఆరుగురిని రిజక్టు చేయడం సంచలనంగా మారింది.

దక్షిణాది రాష్ట్రాల ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తలకు శనివారం నుంచి అనంతపురం నగర శివారు ప్రాంతాల్లో శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఆరు రాష్ట్రాలకు చెందిన 230 మంది ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తలకు శిక్షణనిస్తున్నారు. దీనికి ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఛీఫ్‌ మోహన్‌ భగవత్‌ పాల్గొనవలసి ఉంది. ఆయన శనివారం నుంచి సోమవారం వరకూ ఇక్కడే ఉంటారు. భగవత్‌ శనివారం ఉదయం అనంతపురం రానున్నారనే విషయం తెలిసి భద్రత కోసం పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందిని రైల్వే స్టేషన్‌ కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. భగవత్‌ రైలు దిగిన వెంటనే ఆయన భద్రత కోసం 40 మంది పోలీసులు వెళ్లారు.

ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యకర్తలు అక్కడికెళ్లిన భద్రతా సిబ్బంది 'నేమ్‌ బ్యాడ్జీల'ను తనిఖీ చేసి ముస్లిం పేర్లున్న వారందరినీ వెనక్కు పంపించారు. 40 మంది భద్రతా సిబ్బందిలో ముస్లింలుగా ఉన్న ఆరుగురిని వెనక్కి పంపించారు. వీరిలో ఓ పోలీసు అధికారితోపాటు కానిస్టేబుళ్లు - హోంగార్డులు ఉన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవాన్ని చవిచూడని పోలీసు శాఖ దీనిపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులకు సమాచారమిచ్చింది.