Begin typing your search above and press return to search.

ఆర్.ఎస్.ఎస్. కొత్త ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ హోసబలే !

By:  Tupaki Desk   |   20 March 2021 1:15 PM GMT
ఆర్.ఎస్.ఎస్. కొత్త ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ హోసబలే !
X
ఈ ఏడాది ఆర్ ఎస్ ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) అఖిల భారత ప్రతినిధి సభా సమావేశాలు బెంగళూరులోని చెన్నేహళ్ళిలోని జనాసేవా విద్యాకేంద్రంలో మార్చి 19, 20వ తేదీల్లో జరిగాయి. ఈ సమావేశాల్లో ఆర్ ఎస్ ఎస్ నూతన సర్ కార్యవాహ్ గా దత్తాత్రేయ హోసబలే ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిని ఆర్.ఎస్.ఎస్. పరిభాషలో సర్ కార్యవాహ్ గా వ్యవహారిస్తారు. అలాగే సంఘ్ లో అత్యున్నత బాధ్యతల్లో సర్ సంఘచాలక్ ఉంటారు. ప్రస్తుత ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తర్వాత రెండోస్థానంలో సర్ కార్యవాహ్ నే ఉంటారు. దత్తాత్రేయ హోసబలె కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సొరబ్‌లో జన్మనించారు. ఇంగ్లీష్ లిటరేచర్‌ లో ఆయన పీజీ చేశారు. విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆర్ ఎస్ ఎస్ ‌లో కార్య నిర్వాహకుడికి స్థాయికి ఎదిగారు. 2009 నుంచి ఆయన ఆర్ ఎస్ ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సహ్ కార్య‌వహ్)గా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ కాలంగా సంస్థకు ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి సర్ కార్యవహ్‌ గా ఎన్నుకున్నారు.

ప్రతీ ఏడాది ఏబీపీఎస్ వార్షిక సమావేశం వేర్వేరు చోట్ల జరుగుతుంటుంది. ప్రతీ మూడో సంవత్సరం మాత్రం ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయమైన నాగపూర్‌ లో జరుగుతుంది. అక్కడే సర్ ‌కార్యవహ్ ఎన్నిక జరుగుతుంది. కానీ ఈసారి మహారాష్ట్రలో కరోనా విజృంభణ దృష్ట్యా ఏబీపీఎస్ సమావేశాన్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు. 2009 నుంచి కూడా సర్ కార్యవాహ్ బాధ్యతల్లో భయ్యాజీ జోషి ఉన్నారు. వయోభారం కారణంగా మూడేళ్ల క్రితమే తన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని భయ్యాజీ కోరుకున్నారు. అయితే సంఘ్ పెద్దల కోరిక మేరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి సభా సమావేశాల్లో నిర్వహించిన ఎన్నికల్లో దత్తాత్రేయ హోసబలేని…సంఘ్ ప్రతినిధులు ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు.

ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు హిందుత్వ అజెండాగా ముందుకు సాగుతున్న ఈ వేళ.. హోసబలే సంఘ్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే… 2024లో కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పాలనా పరంగా మోదీ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ సంస్కరణల ఫలాలు మరింత పకడ్బందిగా దేశ ప్రజలకు అందాలంటే మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని సంఘ్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు 2025 విజయదశమినాటికి దేశంలో ఆర్ ఎస్ ఎస్ స్థాపన జరిగి వందేళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా దేశంలోని ఆరు లక్షల గ్రామాలకు సంఘ్ కార్యాన్ని తీసుకువెళ్లాలని ఆర్ ఎస్ ఎస్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.