Begin typing your search above and press return to search.

సామ్నాలో ప్ర‌ణ‌బ్ పై సంచ‌ల‌న విశ్లేష‌ణ‌!

By:  Tupaki Desk   |   10 Jun 2018 4:38 AM GMT
సామ్నాలో ప్ర‌ణ‌బ్ పై సంచ‌ల‌న విశ్లేష‌ణ‌!
X
క‌ర‌డు క‌ట్టిన కాంగ్రెస్ వాదిగా పేరుండి.. ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగి.. రాష్ట్రప‌తిగా ప‌ని చేసిన ప్ర‌ణ‌బ్ దాదా ఇటీవ‌ల సంఘ్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావ‌టం.. స‌భ‌లో ప్ర‌సంగించ‌టం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం మీద ఇప్ప‌టికే పుంఖాను పుంఖాలుగా విశ్లేష‌ణ‌లు.. వార్త‌లు వెలువ‌డ్డాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఒక‌ప్ప‌టి బీజేపీ మిత్ర‌ప‌క్షంగా.. ప్ర‌స్తుతం క‌మ‌ల‌నాథుల‌కు వైరిప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న శివ‌సేన‌.. త‌మ మీడియా సంస్థ అయిన సామ్నా ప‌త్రిక‌లో రాసిన ఎడిటోరియ‌ల్ వ్యాసం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ.. కాంగ్రెస్ రెండు పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన సంఖ్యా బ‌లాన్ని సాధించ‌లేని నేప‌థ్యంలో తాము అనుకుంటున్నట్లుగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని రంగంలోకి దింపుతార‌ని చెబుతున్నారు.

దీనికి సంబంధించి సామ్నా ఎడిటోరియ‌ల్ లో చేసిన తాజా విశ్లేష‌ణ చూస్తే.. ‘‘2019 ఎన్నికల్లో ఆధిక్యతను సాధించడంలో బీజేపీ విఫలమైతే... అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావొచ్చు’’ అని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. ఈ కార‌ణంతోనే తాము నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప్ర‌ణ‌బ్ ను ఆహ్వానించ‌టం.. ఆయ‌న ఓకే అనేయ‌టం వెనుక అస‌లు క‌థ వేరే అన్న రీతిలో త‌న ఎడిటోరియ‌ల్ లో పేర్కొంది.

నెహ్రూ సిద్ధాంతాల్ని పూర్తిగా వంట ప‌ట్టించుకున్న ప్ర‌ణ‌బ్ కు సంఘ్ ఆహ్వానం అంత సులువుగా తీసుకునే వ్యవ‌హారం కాద‌నే మాట వినిపిస్తోంది. ప్ర‌ణ‌బ్ లాంటి ప్ర‌ముఖుడి రాక‌ను ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల కోసం సంఘ్ చాలా స‌మ‌ర్థంగా వినియోగించుకున్న‌ట్లు చెబుతున్నారు. ప్ర‌ణ‌బ్ కు సంఘ్ ఆహ్వానం అంత సులువుగా తీసుకునే ప‌రిణామం కాద‌ని పేర్కొంది. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ అనే బీజేపీ నినాదాన్ని తాము ఏకీభ‌వించ‌టం లేద‌న్న సందేశాన్ని ప్ర‌ణ‌బ్ ను ఆహ్వానించ‌టం ద్వారా సంఘ్ స్ప‌ష్టం చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే సామ్నాలో పేర్కొన్న ఎడిటోరియ‌ల్ లో చేసిన వ్యాఖ్య‌ను చూస్తే.. ‘‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ను కాకుండా... వారసత్వ సారథ్యంలేని కాంగ్రెస్ నే ఆరెస్సెస్‌ ఆకాంక్షిస్తోంది. తాము కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని, ‘గాంధీ’ల వారసత్వానికి మాత్రమే వ్యతిరేమని సంఘ్‌ సంకేతాలు పంపింది’ అని తెలిపింది. పంఘ్ ఆలోచ‌న‌లు ఇలా ఉంటే.. ప్ర‌ణ‌బ్ సైతం త‌న‌ను తాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించుకున్నార‌ని చెప్పాలి. తాను కాంగ్రెస్ తో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నాన‌ని.. తనను తాను స్వ‌తంత్రుడిన‌ని తాజా ప‌రిణామంతో స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెప్పాలి.

కేంద్రంలో కాంగ్రెస్‌.. బీజేపీయేత‌ర ప్ర‌భుత్వం ఉండాల‌ని భావిస్తున్న తృణ‌మూల్ కాంగ్రెస్‌.. టీడీపీ.. టీఆరెస్ పార్టీల‌కు ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న ద‌గ్గ‌ర వెతుకులాట మొద‌ల‌వుతుంది. దాన్ని భ‌ర్తీ చేసేలా ప్ర‌ణ‌బ్ ఇప్పుడు సీన్లోకి వ‌చ్చార‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ప్ర‌ణ‌బ్ ను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌టానికి ఈ పార్టీల‌కు ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌ద‌ని చెప్పింది.

సంఘ్ కు ప్ర‌ధాని కుర్చీలో తాము నిర్దేశించిన వారే కూర్చోవాల‌న్న ఆలోచ‌న త‌ప్పించి.. మిగిలిన ఏమీ పెద్ద అంశాలు కావ‌న్నట్లుగా చెబుతున్నారు. మోడీని ప్ర‌ధానిగా కూర్చోబెట్టాల‌న్న ఆలోచ‌న చేసిన సంఘ్‌.. దానికి త‌గ్గ ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. ప్ర‌ధానిగా ఢిల్లీకి వ‌చ్చిన త‌ర్వాత మోడీ తీరు మారిపోవ‌టం.. సంఘ్ ను సైతం త‌ల ఎగ‌రేసే ప‌రిస్థితి ఉండ‌టంతో.. మోడీ స్థానాన్ని భ‌ర్తీ చేసే దిశ‌గా సంఘ్ పావులు క‌దుపుతోంద‌ని.. దాన్లో భాగ‌మే ప్ర‌ణ‌బ్ ఎంట్రీ అని చెబుతున్నారు. సంఘ్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌ణ‌బ్ అంటూ సంచ‌ల‌న ఎడిటోరియ‌ల్ రాసిన సామ్నా మాట‌లు నిజం ఏంత‌న్న‌ది తేలాలంటే మ‌రికొద్ది కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.