అంబేద్కర్ ను లాగిన ఆర్ఎస్ఎస్
By: Tupaki Desk | 11 April 2015 5:12 AM GMTదళిత నాయకుడిగా ప్రసిద్ది చెందిన బీఆర్ అంబేద్కర్ హిందు మతాభిమాని అని రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చెప్తోంది. మతం మారిన హిందువులు తిరిగి హిందు మతంలోకి రావాలని అంబేద్కర్ కోరారని తెలుపుతోంది.
వచ్చే మంగళవారం అంబేద్కర్ 125 జయంతి నేపథ్యంలో 'అంబేద్కర్ గురించి కొన్ని నిజాలు' పేరుతో 200 పేజీల ప్రత్యేక సంపుటాల అనుబంధాన్నిఆర్ఎస్ఎస్ విడుదల చేయనుంది. అంబేద్కర్ మతం ఎందుకు మార్చుకున్నది, ఇస్లాంపై అంబేద్కర్ అభిప్రాయాలు, ఇస్లాం మతమార్పిడి, కమ్యూనిజం, ఆర్టికల్ 370 గురించి ఇందులో విపులంగా ఉండనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్, అయోధ్యలో రామమందిర నిర్మాణంపైనే ఆర్ఎస్ఎస్ సంపుటాలు విడుదల చేసింది. కానీ ఇపుడు అంబేద్కర్ పై అలాంటి సంపుటి రానుంది. ప్రజలంతా ఐక్యంగా ఉండేందుకు అంబేద్కర్ ఏంచేశారో చెప్పాలని ఇటీవల నాగ్ పూర్ లో జరిగిన సమావేశంలో ఆర్ఎస్ఎస్ నాయకులు నిర్ణయించారు. జాతీయవాది అయిన అంబేద్కర్ పై ఆర్ఎస్ఎస్ విడుదల చేసే పుస్తకంలో పలువురు దళిత నేతల అభిప్రాయాలు ఉండనున్నట్లు సమాచారం. ఈ పుస్తకాన్ని సంఘ్ కార్యనిర్వాహక కార్యదర్శి భయ్యాజీ సురేశ్ జోషి విడుదల చేయనున్నారు.