Begin typing your search above and press return to search.

ఓవైసీ మారలేదబ్బా..ఎంఐఎం అంటేనే ఆరెస్సెస్ వణుకుతోందట!

By:  Tupaki Desk   |   24 July 2019 1:15 PM GMT
ఓవైసీ మారలేదబ్బా..ఎంఐఎం అంటేనే ఆరెస్సెస్ వణుకుతోందట!
X
హైదరాబాద్ పాతబస్తీ పహిల్వాన్ గా పేరు తెచ్చుకున్న మజ్లిస్ పార్టీ నేతలు ఏమాత్రం తమ వైఖరి మార్చుకునేందుకు సిద్ధంగా లేరనే చెప్పాలి. ప్రత్యేకించి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ - ఆయన సోదరుడు - చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ... నోరు తెరిస్తే సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ మాట ముమ్మాటికీ నిజమన్న చందంగా... అక్బరుద్దీన్ ఓవైసీ తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ - రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ దేశానికి ప్రధానే కాదన్న రీతిలో సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్... ఆరెస్సెస్ తమను చూసి వణికిపోతోందని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ వదిలి ఉత్తర తెలంగాణ వెళితేనే ఓ రేంజిలో విరుచుకుపడుతున్న ఓవైసీ... ఇప్పుడు కూడా అక్కడి నుంచే ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కరీంనగర్‌ లో నిర్వహించిన ఆపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్ధుల్ వహిద్ సంస్మరణ సంధర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్పరుద్దిన్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరెస్సెస్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఆరెస్సెస్ తమని తాకే ధైర్యం కూడా చేయలేదని ఆయన అన్నారు. ఎందుకంటే గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ఆ సంస్థను వెంటాడుతున్నాయని అక్బర్ చెప్పుకొచ్చారు. ఆ వ్యాఖ్యలతోనే తనను ఆరెస్సెస్ వ్యతిరేకిస్తోందని కూడా ఆయన ఓ రూలింగ్ తరహా కామెంట్ చేశారు.

ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసిన అక్బరుద్దీన్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది... చాయ్‌వాలా, పకోడివాలా కాదని చెప్పిన ఆయన దేశానికి ప్రధానమంత్రి కావాలని సంచలన కామెంట్ చేశారు. ఒకవేళ ప్రధాని మోదీ తన దగ్గరకు వస్తే చౌకిదార్‌ టోపి - విజిల్ కూడా ఇస్తానని మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నాథూరాం గాడ్సేను పోగిడేవారే ముస్లింలను మతతత్వశక్తులుగా చీత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం చరిత్ర చూస్తే సెక్యులర్ భావాలు ఉన్న పార్టీ ఎవరిదో తెలుస్తుందన్నారు. ఎమర్జెన్సి సమయంలో జరిగిన ఊచకోతల కారణంగానే ఎంఐఎం పుట్టిందని అక్బరుద్దీన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా ఓ వైఫు ఆరెస్సెస్ ను, మరోవైపు మోదీని తులనాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్.. మరోమారు పెను దుమారం చేపారనే చెప్పక తప్పదు.