Begin typing your search above and press return to search.

ఆర్ ఎస్ ఎస్ అంత పని చేసిందా?

By:  Tupaki Desk   |   9 Nov 2015 4:11 AM GMT
ఆర్ ఎస్ ఎస్ అంత పని చేసిందా?
X
సరికొత్త వాదన ఒకటి వినిపిస్తోంది. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడి.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దారుణ పరాజయం పాలైన నేపథ్యంలో ఈ వాదన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి బీజేపీకి నీడ లాంటి ఆర్ ఎస్ ఎస్ ప్రతికూలంగా పని చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. మోడీ.. అమిత్ షా జోడికి షాక్ ఇచ్చేందుకు గత కొద్దికాలంగా ప్రయత్నిస్తున్న సంఘ్ పరివార్.. బీహార్ ఎన్నికల సందర్భంగా తమ అసంతృప్తిని తమ మనసులో దాచుకోకుండా.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేశారన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ.

ఆ మధ్య జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా సంఘ్ పరివార్ బీజేపీకి వ్యతిరేకంగా పని చేసిందన్న మాట వినిపించింది. ఎందుకిలా అంటే.. ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ ఒంటెద్దు పోకడలు పోవటం.. సంఘ్ మాటల్ని లక్ష్య పెట్టకపోవటం.. పార్టీ అంతా తమ గుప్పెట్లోకి తీసుకోవటం సంఘ్ ను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. తమ ఇష్టమన్నట్లుగా వ్యవహరిస్తున్న మోడీ.. అమిత్ షాలకు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు వారికి వ్యతిరేకంగా పని చేసిందన్న మాట వినిపిస్తోంది.

అందరిని కలుపుకోవటంలో మోడీ.. అమిత్ షాలు విఫలం కావటంతో పాటు.. తమ వర్గాన్ని మాత్రమే పెంచి పోషిస్తూ.. తమ వైరి వర్గాన్ని తొక్కేయటంపై సంఘ్ విపరీతమైన అగ్రహంతో ఉంది.మోడీ.. అమిత్ జోడీని బ్రేక్ చేసేందుకు పావులు కదుపుతున్న సంఘ్.. తన సత్తా ఏమిటో మోడీ.. అమిత్ లకు అర్థమయ్యేలా చేసేందుకే బీహార్ ఎన్నికల్లో సంఘ్ ఇలాంటి పని చేసిందన్న మాట వినిపిస్తోంది. టిక్కెట్ల పంపిణీలో అనుసరించిన విధానం.. ఎన్నికల వ్యూహంలో మోడీ పరివారమే అన్నీ నిర్ణయాలు తీసుకోవటమే కానీ.. మిగిలిన వారిని కలుపుకెళ్లే అంశాన్ని అస్సలు పరిశీలించకపోవటం సంఘ్ అగ్రహానికి కారణంగా చెప్పాలి. ఎవరినీ పట్టించుకోకుండా పోతున్న మోడీ.. అమిత్ లకు షాక్ ఇచ్చే విషయంలో సంఘ్ కరకుగా వ్యవహరించి షాకిచ్చిందన్న మాట బలంగా వినిపిస్తోంది.