Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో అర్థరాత్రి వేళ ఆర్టీసీ బస్సు సర్వీస్

By:  Tupaki Desk   |   8 May 2022 5:28 AM GMT
హైదరాబాద్ లో అర్థరాత్రి వేళ ఆర్టీసీ బస్సు సర్వీస్
X
దేశంలోని మహానగరాల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న మహానగరాల్లో ఒకటి మన హైదరాబాద్. దక్షిణ భారతంలో ఒకప్పుడు చెన్నై ఉండేది. ఐటీ బూమ్ ఎప్పుడైతే వచ్చింది దాన్ని అందిపుచ్చుకొని చెలరేగిపోయింది కర్ణాటకలోని బెంగళూరు మహానగరం. కాస్త ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికి.. మిగిలిన మహానగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ గట్టి పోటీనే ఇస్తోంది. చాలా అంశాల్లో మిగిలిన మహానగరాలకు తీసిపోని రీతిలో ఉంది. అదే సమయంలో కొన్ని అంశాల్లో మిగిలిన మహానగరాలు సైతం తన కంటే తక్కువనేలా ఫెర్ ఫార్మ్ చేసి చూపిస్తోంది.

అయితే.. ఇప్పటికి జరిగింది కొంతే. జరగాల్సింది మరెంతో ఉందని మాత్రంచెప్పక తప్పదు. తాజాగా హైదరాబాదీయులకు ఒక తీపి కబురును చెప్పింతి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మహానగరం ట్యాగ్ ఉన్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళలో ప్రజా రవాణా విషయంలో ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఇంత పెద్ద మహనగరంలో అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తెల్లవారుజాము వరకు పరిమిత సంఖ్యలో బస్సుల్ని తిప్పితే లాభం కలుగుతుంది. కానీ.. ఆ విషయంపై పెద్దగా ఫోకస్ చేసింది లేదు.

వేలాది కోట్ల రూపాయిలు సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వాలు.. మౌలిక వసతుల కోసం.. ప్రజా రవాణా కోసం గుప్పెడు నిధుల్ని అందిస్తే.. సామాన్యుల నుంచి అందరికి ఉపశమనం కలిగిస్తుందన్న విషయాన్ని వారు పట్టించుకోరు. ఈ లోపాన్నిచక్కదిద్దే ప్రయత్నంలో తొలి అడుగు వేసింది తెలంగాణ ఆర్టీసీ. నైట్ రైడర్స్ పేరుతో ఆర్టీసీ బస్సుల్ని అర్థరాత్రి దాటిన తర్వాత తిప్పే ప్రయత్నంలో భాగంగా తొలి అడుగు పడింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అర్థరాత్రి 12.15 గంటలకు బయలుదేరు ఆర్టీసీ బస్సు పటాన్ చెరు వరకు వెళుతుంది. ఈ రూట్ లు పలు ప్రత్యేక ట్రిప్పుల్ని తిప్పుతారు. దీనికి వచ్చే ఆదరణను చూసిన తర్వాత.. మిగిలిన రద్దీ రూట్లలో అర్థరాత్రి వేళ బస్సుల్ని తిప్పాలని భావిస్తోంది. అయితే.. ఇలాంటి సౌకర్యం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే.. అందరికి అవగాహన కలగటంతోపాటు.. బస్సులో ప్రయాణించేందుకు మొగ్గు చూపటం ఖాయమని చెప్పకతప్పదు.