Begin typing your search above and press return to search.

కాలం చెల్లిన కథ.. ఇదీ ఆర్టీసీ వ్యథ

By:  Tupaki Desk   |   3 Nov 2019 9:21 AM GMT
కాలం చెల్లిన కథ.. ఇదీ ఆర్టీసీ వ్యథ
X
పైన చూడడానికి అందంగా ముస్తాబైనట్టు కనిపిస్తున్న ఆర్టీసీ బస్సులను చూడగానే మనం ఎక్కేస్తుంటాం.. కానీ అవి ఎప్పుడో కాలం చెల్లినవి. అయినా అధికారులు నడిపించేస్తున్నారన్న సంగతి మీకు తెలుసా? 8 లక్షల కి.మీలు మాత్రమే ఒక ఆర్టీసీ బస్సు తిరగాలి. అంతకుమించితే పక్కన పడేయాలి. కానీ ఆ తర్వాత దాన్ని ఆర్డినరీ బస్సుగా మార్చి 15 లక్షలకు పైగానే తిప్పుతున్నారు. దీంతో నాసిరకం బస్సు ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రయాణించే ప్రయాణికులకు పరీక్ష పెడుతోంది.

ఏపీఎస్ ఆర్టీసీలోని బస్సుల్లో నాలుగింట మూడు వంతుల బస్సులు కాలం చెల్లినవనే కఠిన వాస్తవం బయటకు వచ్చింది. ఈ బస్సులు ఇప్పటికే 8 లక్షల కి.మీల పరిమితి కి మించిపోయాయి. ఏకంగా 15 లక్షల కి.మీల దూరం తిరిగేశాయి. వాటికే మరమ్మతులు చేసి వాడేస్తున్నారు. దీంతో ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి నడుములు విరిగిపోతున్నాయి. నడపడం నరకంగా మారి డ్రైవర్లు, మరమ్మతులు చేయలేక మెకానిక్ లు అష్టకష్టాలు పడుతున్నారట.. ఆర్టీసీ డ్రైవర్లు ఈ బస్సులను నడిపించవద్దు అని లాగ్ షీట్ లో రాస్తున్నా తప్పదు బస్సులు లేవు నడిపించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారట..

ఇప్పుడు ఏపీ ఆర్టీసీలో మూడు వంతుల బస్సులు పనికిరానివే ఉన్నాయి. వీటిని తీసేసి కొత్త బస్సులు కొనలాంటే రూ.1000 కోట్లు కావాలి. అంత డబ్బు ఆర్టీసీ - ప్రభుత్వం వద్ద లేకపోవడంతో బ్యాంకు రుణం కోసం ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే అప్పులకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో పాత కాలం చెల్లిన బస్సులే దిక్కవుతున్నాయి.అవి ప్రయణాకులు, పాదచారులకు యమపాశంగా తయారవుతున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నాయి.