Begin typing your search above and press return to search.

ఆర్టీసీ చార్జీలు పెంపు...త‌ప్పించుకునే మార్గం ఇదొక్క‌టే

By:  Tupaki Desk   |   3 Dec 2019 4:43 AM GMT
ఆర్టీసీ చార్జీలు పెంపు...త‌ప్పించుకునే మార్గం ఇదొక్క‌టే
X
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ నేప‌థ్యంలో...వ‌రాల జ‌ల్లుతో వారిని స‌ర్ ప్రైజ్ చేసి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్...అదే స‌మ‌యంలో రాష్ట్రంలోని ప్ర‌యాణికుల‌కు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. వెంటనే బస్సు చార్జీల పెంపు తప్పదని, కిలోమీటరుకు 20 పైసల చొప్పున ప్రయాణికులపై అదనపు వడ్డన ఉంటుందని ప్ర‌కటించారు. దీని ప్రకారం, మంగళవారం నుంచి చార్జీల పెంపు అమల్లోకి తెచ్చింది. సామాన్యుడు ప్ర‌యాణించే ప‌ల్లెవెలుగు నుంచి మొద‌లుకొని కాస్త డ‌బ్బున్న వారు వెళ్లే ఏసీ బ‌స్సుల దాకా ఈ బాదుడు కొన‌సాగింది. అయితే, ఈ చార్జీల షాకుల‌లో ఒక్క ఉప‌శ‌మ‌నం ఆర్టీసీ క‌ల్పించింది.

ఇప్పటివరకు పల్లెవెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రతి ఐదు కిలోమీటర్ల ప్రాతిపదికన కనీస చార్జీ రూ.6 గా ఉండేది. ఇప్పుడు ఈ కనీసచార్జీని రూ.10 కి పెంచారు. ప్రతి రెండు కిలోమీటర్ల ప్రాతిపదికన సిటీలో కొనసాగుతున్న కనీస చార్జీలను ఆర్డినరీలో రూ.10 కి పెంచారు. మెట్రో డీలక్స్‌ కనీసచార్జీ రూ.10 నుంచి రూ.15కు పెరిగింది. పండుగలు, జాతరల సందర్భాల్లో నడిపే ప్రత్యేక సర్వీసులకు సాధారణ చార్జీల కంటే 1.5 రెట్లు వ‌సూలు చేయ‌నున్నారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీసధర (రూ.10)లో మార్పు చేయలేదు.


సోమవారం నాడు ప్రయాణం ప్రారంభించి దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి.. టికెట్లు ముందుగా బుక్‌చేసుకున్నవారికి పాతచార్జీలే వర్తిస్తాయని ఆర్టీసీ స్పష్టంచేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో తిరిగే మెట్రో, లగ్జరీ, సిటీ శీతల్‌ రకం సర్వీసుల చార్జీల్లో ప్రస్తుతానికి పాత చార్జీలే అమలులో ఉంటాయని.. సవరించిన తర్వాత వాటిని ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా, సోమవారం అర్ధరాత్రి రాత్రి 12 గంటల తర్వాత డిపోల నుంచి బయలుదేరే బస్సుల్లోనూ కొత్త చార్జీల ప్రకారం ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశారు.