Begin typing your search above and press return to search.

నోటీసులను రద్దుచేసిన ఆర్టీసీ యాజమాన్యం!

By:  Tupaki Desk   |   17 May 2022 3:29 AM GMT
నోటీసులను రద్దుచేసిన ఆర్టీసీ యాజమాన్యం!
X
మైలేజీ తగ్గిందని చెప్పి బస్సు డ్రైవర్ల జీతాల్లో రికవరీ చేయాలన్నా నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. మైలేజీకి బస్సు డ్రైవర్ల జీతాలకు ముడిపెడితు కోత విధించాలని అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ డిపో మేనేజర్లు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి ఆర్టీసీ మేనేజ్ మెంట్ కు అసలు సంబంధమే లేదు. కేవలం డిపోమేనేజర్ల పరిధిలో ఓవర్ యాక్షన్ పరంగా తీసుకున్న నిర్ణయానికి యాజమాన్యం సమాధానం చెప్పుకోవాల్సొచ్చింది.

మైలేజీ తగ్గిన కారణంగా జీతాల్లో ఎందుకు కోత విధించకూడదో సమాధానాలు చెప్పాలని చాలామంది డ్రైవర్లకు మేనేజర్ల కార్యాలయాలు నోటీసులిచ్చాయి. దీంతో డ్రైవర్లలో అలజడి మొదలైంది. బస్సు మైలేజీ రావాలంటే ఒక్క డ్రైవర్ నైపుణ్యం మీద మాత్రమే ఆధారపడి ఉండదు.

రోడ్డు బాగుండాలి, ట్రాఫిక్ సమస్యలుండకూడదు, బస్సు మైన్ టెనన్స్ బాగుండాలి, బస్సు ఓవర్ లోడ్ తో ప్రయాణించకూడదనే చాలా కారణాల మీద మైలేజీ ఆధారపడుంటుంది.

మన దగ్గర రోడ్లు ఎలాగున్నాయో అందరికీ తెలిసిందే. ట్రాఫిక్ సమస్యల గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఆర్టీసీలో ఇపుడున్న బస్సుల్లో ఎక్కువగా కాలం చెల్లిన బస్సులే ఉన్నాయి. ఇక బస్సులో సామర్ధ్యానికి మించి లోడుంటుంది. ఒక బస్సులో 40 మందికన్నా ప్రయాణించకూడదు. కానీ బస్సులో 60, 70 మంది ఎక్కేస్తారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సులో ఎక్కితే ఓవర్ లోడ్ సమస్యతో స్పీడు పోలేదు.

ఇలాంటివేవీ పట్టించుకోని డిపో మేనేజర్లు మైలేజి తగ్గిపోవటానికి కేవలం డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేస్తున్నట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దాంతో విషయం యాజమాన్యం దృష్టికి వెళ్ళింది. దాంతో విషయంపై అంతర్గతంగా విచారణ జరిపి నోటీసుల జారీకి డిపోమేనేజర్లే కారణమని తేల్చింది.

దాంతో డిపోమేనేజర్లపై యాజమాన్యం మండిపడింది. డ్రైవర్లకిచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నోటీసులను వెంటనే రద్దు చేయాలని ఆదేశించింది. యాజమాన్యం ఆదేశాల కారణంగా డిపో మేనేజర్లు డ్రైవర్లకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవటమే కాకుండా రద్దు కూడా చేసుకుంటున్నారు.