Begin typing your search above and press return to search.

ఆర్టీసీకి పెద్దోళ్లేనా క‌నిపించేది? కార్మికులు ప‌ట్ట‌రా?

By:  Tupaki Desk   |   30 Sep 2017 5:05 AM GMT
ఆర్టీసీకి పెద్దోళ్లేనా క‌నిపించేది? కార్మికులు ప‌ట్ట‌రా?
X
ఊహించ‌ని రీతిలో ద‌స‌రా కానుక‌ను ప్ర‌క‌టించింది ఆర్టీసీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీల్లో అమ‌ల‌య్యే ఈ ద‌స‌రా కానుక ఎవ‌రికో తెలుసా? రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ఆర్టీసీలో ప‌ని చేసి రిటైర్ అయిన ఉద్యోగుల‌కు. అర‌కొర వ‌చ్చే పెన్ష‌న్ల‌తో ఇబ్బంది ప‌డే ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల కోసం ప్ర‌క‌టించిన తాజా వ‌రం వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తుంద‌ని చెప్పాలి. అదే స‌మ‌యంలో సంస్థ కోసం ప‌ని చేసిన చిన్న‌స్థాయి ఉద్యోగుల క‌డుపు మండిపోయేలా నిర్ణ‌యం ఉండ‌టం గ‌మ‌నార్హం.

రిటైర్ అయ్యాక కూడా ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణానికి అనుమ‌తిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ యాజ‌మాన్యాలు నిర్ణ‌యాలు తీసుకున్నాయి. అయితే.. ఇందులో కొన్ని కండీష‌న్లు ఉన్నాయి. విభ‌జ‌నకు ముందే రిటైర్ అయిన ఆర్టీసీ అధికారుల (డిపో మేనేజ‌ర్‌.. ఆపై స్థాయి)కు ఈ ద‌స‌రా కానుక అమ‌లు కానుంది.

స‌ద‌రు అధికారితో పాటు వారి జీవిత‌భాగ‌స్వామికి కూడా ఈ ఉచిత ప్ర‌యాణం అప్లై అవుతుంది. ప్రీమియం కేట‌గిరీ బ‌స్సుల్లో మాత్రం రాయితీ ధ‌ర‌ల‌కు టికెట్ పొందొచ్చు. అయితే.. అధికారుల‌కు మాత్ర‌మే ఈ వ‌రాన్ని ఇవ్వటంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలాంటి తీపిక‌బురులో అంద‌రిని భాగ‌స్వామ్యం చేయాలే త‌ప్పించి ప‌క్ష‌పాతం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దంటున్నారు. ఆర్టీసీ యాజ‌మాన్యం తీసుకున్న తాజా నిర్ణ‌యం రిటైర్ అయిన చిరుద్యోగుల్లో మంట పుట్టిస్తోంది. ఇక‌.. రాయితీల విష‌యానికి వ‌స్తే.. ఈడీ.. హెచ్ వోడీలు తెలంగాణ సిటీ ఏసీ బ‌స్సుల వ‌ర‌కూ ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. అయితే.. ఏపీలో మాత్రం డీల‌క్స్ బ‌స్సుల వ‌ర‌కు మాత్ర‌మే ఉచితం. జేఎస్‌ వోలు తెలంగాణ సిటీ బ‌స్సుల్లో మెట్రో డీల‌క్స్ వ‌ర‌కు ఉచితంగా ట్రావెల్ చేయొచ్చు. ఏపీలోనూ డీల‌క్స్ వ‌ర‌కు ఫ్రీ.

అన్ని స్థాయిల అధికారుల‌కు రెండు రాష్ట్రాల్లోని జిల్లా స‌ర్వీసుల్లో డీల‌క్స్ వ‌ర‌కు ఫ్రీ. సూప‌ర్ ల‌గ్జ‌రీ.. ఆ పై కేట‌గిరీ బ‌స్సుల్లో 50 శాతం రాయితీ ఇవ్వ‌నున్నారు. అంత‌ర్రాష్ట్ర స‌ర్వీసులకు సంబంధించి అన్ని స్థాయిల అధికారుల‌కు ఏపీ బ‌స్సుల్లో డీల‌క్స్ వ‌ర‌కు ఫ్రీ. తెలంగాణ బ‌స్సుల్లో మాత్రం డీల‌క్స్ వ‌ర‌కూ రాయితీ లేదు. సూప‌ర్ ల‌గ్జ‌రీ.. ఆ పై కేట‌గిరీ బ‌స్సుల్లో ఇరు రాష్ట్రాల బ‌స్సుల్లో 50 శాతం రాయితీ.