Begin typing your search above and press return to search.

చివరకు చినజీయర్ స్వామి శరణు తప్పలేదు

By:  Tupaki Desk   |   31 Oct 2019 4:30 AM GMT
చివరకు చినజీయర్ స్వామి శరణు తప్పలేదు
X
పాతిక రోజులకు పైనే సమ్మె బాటలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ఊహించని రీతిలో వ్యవహరించారు. తామెంత ప్రయత్నించినా సీఎం మనసు మారని నేపథ్యంలో.. సారుకు అత్యంత సన్నిహితుడిగా పేరుతో పాటు.. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారన్న పేరున్న చినజీయర్ స్వామిని కలిశారు.

ఆర్టీసీ ఆస్తుల్ని కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని.. ఆయన మనసు మారేలా చూడాలంటూ స్వాములోరిని కోరిన వైనం ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టి 26 రోజుల తర్వాత.. సీఎం మనసును అంతో ఇంతో ప్రభావితం చేయగల సత్తా ఉన్న చినజీయర్ స్వాములోరి ఆశ్రమానికి వెళ్లిన ఆర్టీసీ డిపో జేఏసీ నేతలు ఆయనకు తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని అందించారు.

నగర శివారులో ఉన్న ముచ్చింత్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన ఆర్టీసీ డిపో జేఏసీ నేతలు స్వాములోరికి వినతిపత్రాన్ని ఇవ్వటమే కాదు.. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు అయ్యేలా చూడాలని కోరారు. ఇటీవల కాలంలో తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేసే వారు జీయర్ స్వామివారి ఆశ్రమానికి వెళ్లటం ఈ మధ్యన ఎక్కువైంది. అదే క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు సైతం ఆశ్రమం బాట పట్టటం గమనార్హం. ఎక్కడైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారుల్ని.. నేతల్ని కలుస్తారు. అందుకు భిన్నంగా స్వాములోరిని కలిసి వినతపత్రాల్ని అందించటం తెలంగాణలో మాత్రమే కనిపిస్తుందని చెప్పక తప్పదు.