Begin typing your search above and press return to search.

హమ్మయ్యా..ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ కరుణించారు!

By:  Tupaki Desk   |   28 Nov 2019 4:11 PM GMT
హమ్మయ్యా..ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ కరుణించారు!
X
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై నిన్నటిదాకా తనదైన శైలి మొండి వైఖరితో సాగుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న టీఆర్ ఎస్ అధినేత - ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు... సమ్మెకు దిగిన కార్మికులకు ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. రేపు ఆర్టీసీ కార్మికులంతా విధుల్లో చేరొచ్చంటూ కేసీఆర్ గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. ఈ వార్త సమ్మె దిగిన 50 వేల మంది ఆర్టీసీ కార్మికులకు భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. గురువారం మధ్యాహ్నం మొదలైన కేబినెట్ భేటీలో ఆర్టీసీ సమ్మె పై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే నేరుగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్... ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఆర్టీసే కాకుండా ఏ సంస్థకు చెందిన కార్మికులపై అయినా తమ ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందని కేసీఆర్ చెప్పారు. అయితే కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే కార్మిక సంఘాలపై ఇప్పటిదాకా కఠినంగా వ్యవహిరంచామని - ఇకపైనా మరింత కఠినంగా వ్యవహరించి తీరతామని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా కార్మిక సంఘాలతో చర్చలకు తాను వ్యతిరేకమని చెప్పిన కేసీఆర్... ఆర్టీసీ కార్మికులను త్వరలోనే ప్రగతి భవన్ కు పిలుస్తానని - వారి మంచి చెడ్డలు తానే స్వయంగా అడిగి తెలుసుకుంటానని కూడా కేసీఆర్ చెప్పారు.

ఇక సమ్మె నేపథ్యంలో ప్రాణాలు వదిలిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాల పైనా కేసీఆర్ సంచలన నిర్ణయాలే ప్రకటించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారంతో పాటు కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని కూడా కేసీఆర్ చెప్పారు. కార్మికులను మొత్తానికి మొత్తంగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించిన కేసీఆర్... ప్రజలపై మాత్రం భారం వేసేశారు. సోమవారం నుంచి ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్... ఆర్టీసీని నష్టాల బాట నుంచి రక్షించేందుకు చార్జీల పెంపు నిర్ణయం తప్పడం లేదని కూడా కేసీఆర్ చెప్పేశారు.