Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆగిన మరో గుండె

By:  Tupaki Desk   |   4 Nov 2019 5:20 AM GMT
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : ఆగిన మరో గుండె
X
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకి ముగింపే దొరకడంలేదు. సమ్మె ప్రారంభమై నెల రోజులు దాటుతుంది. కానీ , సమ్మె పై అటు ప్రభుత్వం , ఇటు ఆర్టీసీ జేఏసీ వెనక్కి తగ్గకపోవడంతో ఈ సమ్మె అలానే కొనసాగుతుంది. హైకోర్టు లో వాదనలు జరుగుతున్న కూడా సమ్మెకు మాత్రం సరైన పరిష్కారం దొరకడంలేదు. ఈ సమ్మె ప్రభావం తో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు , విద్యార్థులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. అలాగే సమ్మె పై ప్రభుత్వం వ్యవహరించే తీరుతో ఇప్పటికే పలువురు ఆర్టీసీ కార్మికుల గుండెలు ఆగిపోగా ..తాజాగా మరో గుండె ఆగిపోయింది.

దేవరకొండ బస్‌ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. మృతుడి స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పగిడిపల్లి. గత నెల 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆందోళనలో జైపాల్ కీలకంగా పాల్గొంటున్నాడు. ఇతను మరో ఆరు నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. నవంబర్ 03వ తేదీ ఆదివారం తోటి కార్మికులతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటికి వచ్చిన అనంతరం ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.

వెంటనే కుటుంబసభ్యులు తోటి ఆర్టీసీ కార్మికులకు సమాచారం అందించారు. అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కానీ..మార్గమధ్యంలోనే జైపాల్ తుదిశ్వాస విడిచాడు. ప్రభుత్వం, ఆర్టీసీ యజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జైపాల్‌రెడ్డి మృతికి నిరసనగా డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు, వివిధ పార్టీల నేతలు ధర్నా నిర్వహించారు. పరామర్శించడానికి వచ్చిన డిపో మేనేజర్‌ను అడ్డుకున్నారు. సమ్మె పట్ల ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం, ఒత్తిడికి గురయ్యే వాడని తోటి కార్మికులు వెల్లడిస్తున్నారు.జైపాల్‌రెడ్డి మృతితో సూర్యాపేట డిపో వద్ద కూడా ఉద్రికత్త చోటుచేసుకుంది. దేవరకొండ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దాదాపుగా ఇప్పటికి ఈ సమ్మె ప్రభావంతో సుమారుగా 17 మంది ఆర్టీసీ కార్మికులు తమ ప్రాణాలని కోల్పోయారు