Begin typing your search above and press return to search.

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ కు లాభమా? నష్టమా?

By:  Tupaki Desk   |   27 Nov 2019 5:41 AM GMT
ఆర్టీసీ సమ్మె: కేసీఆర్ కు లాభమా? నష్టమా?
X
ఆర్టీసీ సమ్మె వల్ల లాభం ఎవరికి.? నష్టం ఎవరికి? 52 రోజులుగా సమ్మె చేసిన కార్మికులను కేసీఆర్ సర్కారు విధుల్లోకి తీసుకోవడం లేదు. దీంతో డిపోల వద్ద కార్మికుల అరెస్ట్ లు, ధర్నాలతో అల్లకల్లోలంగా మారింది. మరి ఆర్టీసీ సమ్మెపై ఇంత కఠినంగా ఉంటున్న గులాబీ దళపతికి కేసీఆర్ పై వ్యతిరేకత ప్రజ్వరిల్లుతోందా? 49వేల మంది కార్మికులు దాదాపు 2 లక్షల మంది వారి కుటుంబాల్లో ఇప్పుడు కేసీఆర్ అంటే పీకల్లోతు కోపం.. మరి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆర్టీసీ సమ్మె విషయంలో  కేసీఆర్ వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారా? సరైందంటున్నారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్నాయి.

ఆర్టీసీ సమ్మెతో కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో కేసీఆర్ పై వ్యతిరేక భావం అయితే పెరిగిపోయింది. అయితే 49వేల మంది కంటే 4 కోట్ల మంది ప్రజలు కోరుకున్నదే కేసీఆర్ చేశారని గులాబీ శ్రేణులు అంటున్నాయి. నిజంగా కేసీఆర్ పై వ్యతిరేకత ఉంటే హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓడిపోయేదంటున్నారు. ప్రజలు కేసీఆర్ చేసింది రైట్ అని చెప్పారని.. పండుగల పూట సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెబుతున్నారు.

కార్మికులు దిగివచ్చినా కేసీఆర్ పట్టువీడకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. తెగే దాకా లాగితే ప్రభుత్వానికే నష్టం అని గులాబీ శ్రేణులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ కొందరు సాధారణ పౌరులు మాత్రం సమ్మెతో అలసిపోయామని.. ఇలాంటి కఠినంగా ఉంటేనే వ్యవస్థ సెట్ రైట్ అయిపోతుందని కేసీఆర్ కు మద్దతు పలుకుతున్నారు.

కేసీఆర్ ఆర్టీసీ సమ్మె విషయంలో చూపిన మొండి వైఖరి కొన్ని వర్గాల్లో ఆయనపై వ్యతిరేక భావాన్ని నింపినా.. కార్మిక సంఘాల కబంధ హస్తాల్లో సంస్థలను నాశనం చేస్తున్న వారికి మాత్రం గట్టి హెచ్చరికగానే పనిచేస్తోందని అంటున్నారు. సాధారణ ప్రజల్లో సైతం ఆర్టీసీ సమ్మెపై సానుభూతి లేదంటున్నారు. మరి కేసీఆర్ నిర్ణయం కరెక్టా రాంగ్ అన్న దానిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి - VS Rao