Begin typing your search above and press return to search.

ద‌క్షిణ భార‌తీయుల కామెంట్‌..స‌భ‌లో దుమారం

By:  Tupaki Desk   |   10 April 2017 10:38 AM GMT
ద‌క్షిణ భార‌తీయుల కామెంట్‌..స‌భ‌లో దుమారం
X
ద‌క్షిణ భార‌తీయుల‌పై జాతివివ‌క్ష వ్యాఖ్య‌లు చేసిన‌ బీజేపీ నేత త‌రుణ్ విజ‌య్ అంశం ఇవాళ లోక్‌స‌భ‌లో దుమారం లేపింది. త‌రుణ్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష‌ నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌రుణ్ సాధార‌ణ వ్య‌క్తి కాదు అని, అత‌ను బీజేపీ భావ‌జాలం గురించి వ్యాసాలు రాస్తారు అని, మ‌రి ద‌క్షిణ భార‌తీయులు ఈ దేశ పౌరులు కారా అని మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్ర‌శ్నించారు. దేశం గురించి అనేక పుస్త‌కాలు రాసిన ఓ వ్య‌క్తి ద‌క్షిణ భార‌తీయుల గురించి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని అడిగారు. బీజేపీ నేత‌లు దేశంలో స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నార‌ని, అవ‌మానాలు చేసి ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నార‌ని ఖ‌ర్గే అన్నారు.

మాజీ ఎంపీ త‌రుణ్‌పై ప్ర‌భుత్వం ఎటువంటి చ‌ర్య తీసుకుంటుందో తెలియ‌జేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఖ‌ర్గే కోరారు. త‌రుణ్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేస్తారా లేదా అని ప్ర‌శ్నించారు. ఆర్టిక‌ల్ 15 ప్ర‌కారం ఎవ‌రిపైనా వివ‌క్ష చూప‌రాద‌న్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ ఈ అంశంపై ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడారు. భారత్ లౌకిక దేశమని, కులం, మతం, వర్ణం ఆధారంగా వివక్ష ఉండదని అన్నారు. స‌ద‌రు వ్య‌క్తి ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండ‌రాద‌ని తెలిపారు.

ఇటీవ‌ల ఆఫ్రికా విద్యార్థుల‌పై జ‌రిగిన దాడికి సంబంధించి ద స్ట్రీమ్ అనే ఆఫ్రిక‌న్ చానెల్‌తో త‌రుణ్‌ మాట్లాడుతూ.. ద‌క్షిణ భార‌తీయుల ప‌ట్ల అనుచితంగా మాట్లాడారు. `మా దేశంలోనూ త‌మిళ‌నాడు - కేర‌ళ‌ - ఆంధ్ర‌ప్రదేశ్‌ - క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు న‌ల్ల‌గా ఉంటారు. అయినా వాళ్ల‌ను మేము అంగీక‌రిస్తున్నాము` అంటూ త‌రుణ్ నోరు జారారు. ఆ త‌ర్వాత త‌న త‌ప్పు తెలుసుకున్న త‌రుణ్‌.. ట్విట్ట‌ర్‌ లో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. `మేము కృష్ణున్ని పూజిస్తాం అంటే న‌లుపును గౌర‌విస్తామ‌నే నేను చెప్పాను. నిజానికి జాతి వివ‌క్ష‌ను మొద‌ట వ్య‌తిరేకించింది భార‌తే. మేమే బ్రిటిష్ జాతి వివక్ష‌కు బాధితుల‌మ‌య్యాం` అని త‌రుణ్ ట్వీట్ చేశారు. అయిన‌ప్ప‌టికీ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/