Begin typing your search above and press return to search.

రుద్ర‌మ దేవి అలా మ‌ర‌ణించారా?

By:  Tupaki Desk   |   27 Jan 2018 4:48 AM GMT
రుద్ర‌మ దేవి అలా మ‌ర‌ణించారా?
X
చ‌రిత్ర‌కు సంబంధించి చాలా అంశాల‌పై స్ప‌ష్ట‌త లేని ప‌రిస్థితి. అలాంటి వాటిలో వీర‌నారి.. కాక‌తీయ సామ్రాజ్ఞి రుద్ర‌మ దేవి మ‌ర‌ణం ఎలా సంభ‌వించింద‌న్న అంశంపై చాలా వాద‌న‌లే ఉన్నాయి. ఆమెది స‌హ‌జ‌మ‌ర‌ణ‌మ‌ని కొంద‌రంటే.. కాదంటే కాద‌ని వాదించేవారున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె మ‌ర‌ణానికి సంబంధించిన ఒక కొత్త సాక్ష్యం ల‌భించింది. త‌న శ‌త్రు రాజైన కాయ‌స్థు అంబ‌దేవునితో జ‌రిగిన యుద్ధంలో రుద్ర‌మదేవి వీర మ‌ర‌ణం పొందిన‌ట్లుగా చెబుతారు. అయితే.. దీనికి సంబంధించిన కీల‌క ఆధారాలు ఇప్ప‌టివ‌ర‌కూ ల‌భ్యం కాలేదు. ఇలాంటి వేళ‌.. తాజాగా రెండు విగ్ర‌హాలు ల‌భించ‌టం.. అవి రుద్ర‌మ వీర మ‌ర‌ణం గురించి చెప్పేలా ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది.

కాక‌తీయ రాజుల చ‌రిత్ర‌పై పెద్ద ఎత్తున స‌ర్వే నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌తీయ పురావ‌స్తు శాఖ‌కు చెందిన కొంద‌రు అధికారులు కొన్ని నెల‌లుగా కాక‌తీయుల కాలంలో నిర్మించిన దేవాల‌యాలు.. శిల్ప క‌ళా సంప‌ద‌పై అధ్య‌య‌నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు.. మ‌హ‌రాష్ట్ర.. ఛ‌త్తీస్ గ‌ఢ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ.. రుద్ర‌మ‌దేవికి సంబంధించిన విగ్ర‌హాల్ని క‌నుగొంటున్నారు.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా ఆమె మ‌ర‌ణంపై క్లారిటీ వ‌చ్చే శిల్పాల్ని గుర్తించారు. వ‌రంగ‌ల్ కోట స‌మీపంలో ఉన్న బొల్లికుంట గ్రామంలో పురాత‌న శివ‌కేశ‌వ ఆల‌యం ప‌క్క‌నే ఉన్న రాతి బండ‌ల మ‌ధ్య‌లో రెండు శిల్పాల్ని గుర్తించారు.

ఇంత‌కాలం పాటు గ్రామ దేవ‌త‌లుగా పూజ‌లు అందుకున్న ఈ విగ్ర‌హాలు.. రుద్ర‌మ‌దేవికి సంబంధించిన‌విగా తేల్చారు. ఇందులో ఒక విగ్ర‌హంలో వీర‌నారిగా రుద్ర‌మ క‌నిపిస్తే.. మ‌రో విగ్ర‌హంలో ఆమె మ‌ర‌ణానికి సంబంధించిన వైనాన్ని చెప్పేలా విగ్ర‌హం ఉంది.

మొద‌టి విగ్ర‌హంలో ప‌రాక్ర‌మ‌శాలిగా చేతిలో ఖ‌డ్గం.. శిర‌స్సుపై ర‌క్ష‌ణ ఛ‌త్రం లాంటి రాజ‌లాంఛ‌నాల‌తో యుద్ధానికి వెళుతున్న‌ట్లు గంభీరంగా శిల్పం ఉంటే.. రెండో విగ్ర‌హంలో అల‌సిపోయిన ముఖంతో.. శిర‌స్సుపై ఛ‌త్రం లేకుండా ఉన్న రుద్ర‌మ క‌నిపిస్తోంది. అశ్వం సైతం క‌ద‌ల్లేనిదిగా క‌నిపించ‌టం.. ముఖాన్ని దించి ఉంచ‌టం.. విషాద‌వ‌ద‌నంతో ఉండ‌టాన్ని బ‌ట్టి యుద్ధంలో రుద్ర‌మ వీర మ‌ర‌ణం పొంది ఉంటార‌న్నది స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఈ శిల్పంపై స్వ‌ర్గం.. య‌ముని వాహ‌న‌మైన దున్న‌పోతు ఉండ‌టం చూస్తే.. వ‌య‌సు మీద ప‌డిన రుద్ర‌మ శ‌త్రురాజుతో పోరాడి మ‌ర‌ణించి ఉంటార‌న్న అభిప్రాయాన్ని పురావ‌స్తు నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ల‌భించిన రెండు విగ్ర‌హాలు రుద్ర‌మ మ‌ర‌ణానికి సంబంధించి కీల‌క ఆధారాన్ని అందించేలా ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.