Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణయానికి చెల్లుచీటి.. ఈ ఏడాదికి లాటరీతోనే వీసాలు

By:  Tupaki Desk   |   5 Feb 2021 1:10 PM GMT
ట్రంప్ నిర్ణయానికి చెల్లుచీటి.. ఈ ఏడాదికి లాటరీతోనే వీసాలు
X
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ సర్కారు తెచ్చిన కొత్త నిబంధనలకు చెల్లుచీటి ఇస్తూ.. పాత విధానాల్ని అమల్లోకి తెస్తోంది బైడెన్ ప్రభుత్వం. తాజాగా కీలకమైన హెచ్1బీ వీసా విధానం కూడా ఇప్పుడా జాబితాలోకి చేరింది. అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్1బీ వీసాల జారీ విషయంలో సుదీర్ఘకాలంగా లాటరీ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ విధానాన్ని మార్చి.. ప్రతిభ.. గరిష్ఠ వేతనం ఉన్న వారికి మాత్రమే వీసాలు జారీ చేసే పద్దతిని తెర మీదకు తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికన్లకు మేలు చేస్తామన్న మాటతో.. ఈ విమర్శల్ని.. కంపెనీల వినతుల్ని ఖాతరు చేయలేదు ట్రంప్ సర్కారు.

ఇదిలా ఉంటే.. తాజాగా హెచ్1బీ వీసా విధానాన్ని పాత పద్దతైన లాటరీ విధానంలోనే ఎంపిక చేసేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ ఈ లాటరీ పద్దతి ఏమిటన్నది చూస్తే.. ప్రతి ఏడాది హెచ్1బీ వీసాల కోసం లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్దతిలో 65వేల దరఖాస్తుల్ని మాత్రమే ఎంపిక చేస్తారు. వీటితో పాటు సైన్స్.. టెక్నాలజీ.. ఇంజనీరింగ్.. మ్యాథ్స్ విభాగాల్లో అమెరికాలోని వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా విదేశీ విద్యార్థులకు 20వేల వీసాల్ని జారీ చేస్తుంటారు.

అయితే.. ఈ విధానాలతో స్థానిక అమెరికన్లకు రావాల్సిన అవకాశాల్ని విదేశీయులు సొంతమవుతున్నాయంటూ ట్రంప్ సర్కారు లాటరీ విధానానికి చెల్లుచీటిని ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం.. లాటరీ పద్దతిని పునరుద్దరించింది. ట్రంప్ సర్కారు విధించిన నిషేధాన్ని తాజాగా బైడెన్ ప్రభుత్వం ఎత్తి వేయటంతో.. ఏప్రిల్ ఒకటి నుంచి వీసాల నమోదు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. పాత పద్దతిని పునరుద్ధరించటంతో భారతీయుల డాలర్ డ్రీమ్స్ మరింత తొందరగా నిజమవుతాయని చెప్పక తప్పదు. ఈ వార్త అమెరికాకు వెళ్లాలనుకునే వారికి శుభవార్తే.