Begin typing your search above and press return to search.

ఇసుకను మింగేస్తున్నారు....

By:  Tupaki Desk   |   8 Sep 2018 1:09 PM GMT
ఇసుకను మింగేస్తున్నారు....
X
ఆంధ్రప్రదేశ్‌ లో ఇసుక మాఫీయా కదం తొక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో వివిధ జిల్లాల నుంచి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో అసలు ఇసుక మాఫీయా లేదని - ప్రతిపక్షాలు అనవసరంగా తమపై బురద జల్లే ప్రయత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. అయితే ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న కొంతమంది అధికారులను తమకు అనుకూలంగా మార్చుకుని ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు హస్తం కూడా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం పేద - మధ్య తరగతి ప్రజల కోసం ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక పథకాన్ని తప్పుదారి పట్టించి అక్రమంగా తరలిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలిసులకు - అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని వారంటున్నారు.ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇసుక మాఫీయా కోరలు చాస్తోందని - తెలంగాణలోని ఇసుక దందా కొంత మంది అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఖమ్మం - మెదక్ - నిజామాబాద్ - కరీంనగర్ జిల్లాల్లో ఇసుకను దొడ్డిదారిన మళ్లిస్తునారని, అయితే కొంతమంది పెద్దల అండ ఉండడంతో ఇసుక మాఫీయపై కేసులు పెట్టడానికి పోలిసులు జంకుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇసుక మాఫీయా గురించి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇసుకను అక్రమంగా రవాణ చేస్తున్నారని - అధికారులు కూడా ఈ దందాకు వంత పాడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని - కోట్లాది రూపాయలు ఖర్చు చేసైన సరే అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోందని, అందుకే ఇసుక మాఫీయా ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తమ పార్టీయే కనుక అధికారంలో ఉంటే ఈ ఇసుక మాఫీయా అరికట్టడానికి నెల రోజల సమయం చాలని అన్నారు. గతంలో కూడా తమ పార్టీ ఇసుక మాఫీయాను తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన అన్నారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గెలిచి - తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటించమని ఆ పార్టీ అడగడంలో తప్పు లేదని అన్నారు.