Begin typing your search above and press return to search.

వైఎస్సాఆర్ ఆసరా నుండి ఎంఎల్ఏకి రూ. 5 వేలు ఇవ్వాలంట!

By:  Tupaki Desk   |   19 Oct 2020 1:30 PM GMT
వైఎస్సాఆర్  ఆసరా నుండి ఎంఎల్ఏకి రూ. 5 వేలు ఇవ్వాలంట!
X
మహిళల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా పథకంలో అవినీతి జరుగుతోందా ? అదికూడా ఎంఎల్ఏల స్ధాయిలోనే జరుగుతోందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గుంటూరు జిల్లాలోని ఓ ఎంఎల్ఏ మహిళా లబ్దిదారుల నుండి తలా రూ. 5 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తన వసూళ్ళ కోసం సదరు ఎంఎల్ఏ మరికొంతమంది వాలంటీర్లను పెట్టుకున్నారని సమాచారం. మహిళల దగ్గర నుండి వసూలు చేసిన మొత్తాన్ని తన ఆఫీసుకు తెప్పించుకున్నారట.

అయితే రూ. 5 వేలు ఇవ్వటానికి కొందరు మహిళలు ఇష్టపడకుండా ఎదురుతిరిగారట. దాంతో వచ్చే ఏడాది అందాల్సిన రూ. 18500 అందకుండా లబ్దిదారుల జాబితా నుండి పేర్లను తొలగించటం ఖాయమని ఎంఎల్ఏ అనుచరులు బెదిరిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. డబ్బులు ఇవ్వటానికి నిరాకరిస్తున్న మహిళలతో కొందరు వాలంటీర్లు దగ్గరుండి ఎంఎల్ఏతో ఫోన్లో మాట్లాడిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో జరుగుతున్న ప్రచారానికి విరుద్ధంగా మరో ప్రచారం కూడా జరుగుతోంది.

తన పేరుతో కొందరు మహిళల నుండి డబ్బులు వసూలు చేస్తున్న విషయం సదరు ఎంఎల్ఏకి తెలిసిందట. దాంతో విషయంపై ఆరాలు తీసిన ఎంఎల్ఏ ఇందుకు కారణమన్న అనుమానంతో కొందరు వాలంటీర్లను బాధ్యతల నుండి తప్పించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. రెండు విధాలుగా జరుగుతున్న ప్రచారంతో గ్రౌండ్ లెవల్లో అయితే అయోమయం మొదలైంది. మహిళలందరికీ మంచి జరగాలని జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఇటువంటి ప్రచారం పార్టీకి, ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదని సీనియర్ నేతలు మొత్తుకుంటున్నారు. మరి ఈ విషయమై జగన్ ఓ సారి గట్టిగా దృష్టి పెట్టి విచారణ జరిపిస్తే బాగుంటుందని లబ్దిదారులు కోరుకుంటున్నారు.