Begin typing your search above and press return to search.

క‌ర్నూలులో క‌ల‌వ‌రం.. భ‌యాందోళ‌న‌లో వేల‌మంది!

By:  Tupaki Desk   |   16 April 2020 9:10 AM GMT
క‌ర్నూలులో క‌ల‌వ‌రం.. భ‌యాందోళ‌న‌లో వేల‌మంది!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో కరోనా వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఆ వైర‌స్ కేసులు అత్య‌ధికంగా క‌ర్నూలులో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోనే క‌రోనా కేసుల్లో రెండు స్థానంలో క‌ర్నూలు జిల్లా ఉంది. ఇప్ప‌టికే ఆ జిల్లాలో ఒక క‌రోనా బాధితుడి మృతి చెంది ఉండ‌గా తాజాగా మ‌రొక వ్య‌క్తి క‌రోనాతో మృతిచెందాడ‌నే వార్తతో జిల్లాలో ఆందోళ‌న‌క‌రంగా ప‌రిస్థితులు మారాయి. క‌రోనాతో ఓ అల్లోపతి వైద్యుడు మృతిచెందాడ‌ని సోష‌ల్ మీడియాతో పాటు ప్ర‌జ‌ల్లో వినిపిస్తున్న మాట‌. అయితే అధికార యంత్రాంగం మాత్రం ధృవీక‌రించ‌డం లేదు. ఆయ‌న మృతిచెంద‌క‌ముందు ఎంతోమందికి వైద్య సేవ‌లు చేశారు. ఇప్పుడు ఆ వైద్యుడు మృతిచెందాడ‌నే విష‌యం తెలుసుకున్న వారంతా భ‌యాందోళ‌న చెందే ప‌రిస్థితి ఏర్ప‌డింది. త‌మ‌కు అత‌డి వ‌ల‌న క‌రోనా సోకిందేమోన‌ని ఆస్ప‌త్రుల‌కు ప‌రుగులు పెడుతున్నార‌ని చ‌ర్చ సాగుతోంది.

ఈ విష‌యం అధికారంగా వెల్ల‌డించ‌క‌పోయినా క‌రోనా వైర‌స్ విస్త‌రించే ప్ర‌మాదం ఉండ‌డంతో అధికారులు మృతి చెందిన వైద్యుడితో వైద్యం పొందిన వారిని, వారి కుటుంబ‌స‌భ్యుల‌ను సంప్ర‌దించి క్వారంటైన్‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేస్తున్నార‌ని స‌మాచారం. దాంతో పాటు వారి న‌మూనాల‌ను సేక‌రిస్తున్నారని తెలుస్తోంది.

కర్నూలు నగరంలోని ఎన్‌ఆర్‌ పేటకు చెందిన అల్లోపతి వైద్యుడు కరోనా లక్షణాలతో ఈ నెల 13వ తేదీన కర్నూలులోని జీజీహెచ్‌లో చేరారు. వైద్య పరీక్షల అనంత‌రం అత‌డిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కరోనా నిర్ధారణ కోసం నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ఓ ల్యాబ్‌కు పంపించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారని, దీంతో మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీకి తరలించారని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది. ఈనెల 14వ తేదీన క‌రోనా వైరస్‌తో ఆ అల్లోపతి వైద్యుడు మృతిచెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

అయితే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వివరాలను జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ వ్యక్తి మృతదేహాన్ని వైద్యులు అనధికారికంగా ఖననం చేసినట్లు స‌మాచారం. నగరంలోని ఓ దర్గా వద్ద ఖననానికి ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలను కొందరు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అవి ప్ర‌స్తుతం వైరల్‌ అవుతున్నాయి. వాటిని ఆధారంగా క‌ర్నూలులో క‌ల‌క‌లం ఏర్ప‌డింది.

ఆయన గ‌తంలో వందలాది మందికి వైద్య సేవలు అందించారని, పలువురు సిబ్బందితో కలిసి పని చేశారు. ఆయనతో సంబంధం ఉన్న వారి వివరాలు సేక‌రించగా 1,150 మంది వివ‌రాలు ల‌భించాయి. ప్ర‌స్తుతం వారితో పాటు వారి కుటుంబ‌స‌భ్యుల‌ను, వారు క‌లిసిన వారిని కూడా అధికారులు గుర్తించి వారికి ప‌రీక్ష‌లు చేసే అవ‌కాశం ఉందని చ‌ర్చ సాగుతోంది. ఆ వైద్యుడితో పరిచయమున్న, అతడి సేవలు పొందిన వారు, వారితో కాంటాక్ట్‌ అయినవారు కరోనా పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు. ఆ వ్యక్తి వద్ద పనిచేసిన వర్కర్లను బుధవారపేట నుంచి పరీక్షల నిమిత్తం మంగళవారం రాత్రి అధికారులు తీసుకెళ్లారంట‌.

వర్కర్లు, పరిచయస్తుల నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించే ప్ర‌మాదం ఉండ‌డంతో అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టిందని ప‌రిణామాల‌ను చూస్తుంటే వాస్త‌వంగా క‌నిపిస్తోంది. ప‌రిస్థితి చేయి దాటక ముందే అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్‌లను ఐసొలేషన్‌కు తరలించాలని, కాంటాక్ట్‌ అయినవారి వివరాలను సేకరించాలని సంబంధిత కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరి నుంచి నమూనాలు సేకరించారని తెలిసింది. మృతుడి అల్లుడు ఓ జిల్లాకు ఉన్నతాధికారిగా ఉన్నారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న ఆయన.. అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అయితే ఈ మరణంపై నగర ప్రజల్లో ఆందోళన రేకెత్తుతోంది.