Begin typing your search above and press return to search.

ఉపాసన కోసం చిరంజీవి ప్రచారం.. ఉత్త గ్యాస్!

By:  Tupaki Desk   |   3 April 2019 4:22 PM GMT
ఉపాసన కోసం చిరంజీవి ప్రచారం.. ఉత్త గ్యాస్!
X
తన కోడలు ఉపాసన కోసం మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి తరఫున ప్రచారం చేస్తారని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. చూస్తుంటే ఇది ఉత్త గ్యాస్ అని స్పష్టం అవుతోంది. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని.. ఆయన దృష్టి ఇప్పుడు కేవలం సినిమాల మీదే ఉందని స్పష్టం అవుతూనే ఉంది. ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చి ఎదురుదెబ్బ తిని వెళ్లిపోయాడు మెగాస్టార్. అలా కాడి వదిలేసి వెళ్లాకా తన రాజ్యసభ సభ్యత్వ కాలం ఉండగానే మెగాస్టార్ కామ్ అయిపోయాడు. కాంగ్రెస్ వాళ్లు చిరంజీవిని ఎంతగా పిలిచినా ఏపీ రాజకీయాలను మెగాస్టార్ పట్టించుకోలేదు.

కేవలం ఏపీ విషయంలోనే కాదు.. కర్ణాటకలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా చిరంజీవిని రారమ్మంటూ కాంగ్రెస్ వాళ్లు ఒత్తిడి చేశారు. కర్ణాటకలో చిరంజీవి ప్రచారంతో కొద్దో గొప్పో ఓట్లు రావొచ్చని వారు ఆహ్వానించారు. అయితే చిరంజీవి పట్టించుకోలేదు!

అంతేనా..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతున్న సమయంలో కూడా మెగాస్టార్ పార్టీని కానీ, రాజకీయాలను కానీ పట్టించుకోలేదు. ఏదో గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఇవ్వలేదు. పైపెచ్చూ తన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలం ముగిసిందని కూడా చిరంజీవి లీక్ ఇచ్చారు. తద్వారా తనకు కాంగ్రెస్ తో సంబంధాలు లేవని మెగాస్టార్ ప్రకటించుకున్నట్టు అయ్యింది.

కాంగ్రెస్ తోనే కాదు.. రాజకీయాలతోనే పెద్దగా సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు చిరు. అవతల సొంత తమ్ముడు సొంత పార్టీతో వెళ్లి రాజకీయాల్లో కష్టపడుతూ ఉన్నాడు. ఇలాంటి నేఫథ్యంలో కూడా ఎన్నికల వేళ కూడా చిరంజీవి అటు వైపు చూడటం లేదు!

ఇప్పుడు మెగాస్టార్ ఎండకాలం సెలవుల్లో ఉన్నారు! ఇన్ని రోజులూ సైరా షూటింగులో చెమటోడ్చిన చిరంజీవి ఇప్పుడు జపాన్ విహారయాత్రలో ఉన్నారని తెలుస్తోంది. భార్యతో కలిసి ఆయన టూరేశారు. జపాన్ లో సేదతీరిన అనంతరం ఆయన సైరాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ లో పాల్గొననున్నారని సమాచారం.

ఇలాంటి సమయంలో తన కోడలు పిన్ని భర్త అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి కోసం చిరంజీవి ప్రచారం చేస్తారు అనేది ఉత్తిమాటే. పైపెచ్చూ పోలింగ్ కు ఇంక పెద్దగా సమయం కూడా లేదు. ఇలాంటి సమయంలో టూర్లో ఉన్న చిరంజీవి ప్రచారానికి వస్తారనుకోవడం భ్రమే. ఏదో రెండు మూడు రోజుల ప్రచారం చేసి తెరాసతో సంబంధాలు చెడగొట్టుకోవడానికి చిరంజీవి రెడీగా లేరు. కేటీఆర్ తో చిరంజీవి చాలా సత్సంబంధాలు నెరుపుతున్నారనేది అందరికీ తెలిసిన సంగతే!