Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో ‘ఉప్పు’ కలకలం

By:  Tupaki Desk   |   13 Nov 2016 4:47 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ‘ఉప్పు’ కలకలం
X
ఎవరిని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. చీమ చిటుక్కుమన్నా అదిరిపోయి.. బెదిరిపోయే పరిస్థితి. నిన్నటి వరకూ చాలా విషయాల్లో ఏమీ జరగదని నిశ్చితాభిప్రాయాన్ని వ్యక్తం చేసినోళ్లు సైతం.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఏ రోజు.. ఏదైనా జరగొచ్చన్న మాటను పూర్తిగా విశ్వసిస్తున్నారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో దేశంలో ఇప్పటివరకూ సాధ్యం కానివి సైతం.. సాధ్యమయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఇదే ఇప్పుడు కొత్త తిప్పల్ని తెచ్చి పెడుతోంది. అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్.. గుజరాత్ లలో ఉప్పు ఉత్పత్తి తగ్గిపోయిందని.. భారీగా డిమాండ్ పెరిగి.. కేజీ ఉప్పు రూ.300 నుంచి రూ.700 వరకు అమ్ముతున్నట్లుగా వచ్చిన వార్తలతో తెలుగు ప్రాంతాల ప్రజలకు ఉప్పుపై సరికొత్త బెంగ బయలుదేరింది. అంతే.. పక్కనున్నకిరాణా షాపు మొదలు సూపర్ మార్కెట్ల వరకూ వదిలి పెట్టకుండా ఎక్కడ ఉప్పు దొరికినా కొనేస్తున్నారు. ఈ కొత్త పుకారుతో ఉప్పు రేటు భారీగా పెరిగిపోవటమే కాదు.. హైదరాబాద్ లో కేజీ ఉప్పు రూ.300 వరకూ అమ్మే వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఉప్పుపై వెల్లువెత్తుతున్న వదంతులతో ఏడాదిలో అమ్మే ఉప్పును ఒక్కరోజులో అమ్మేసిన వైనం కనిపిస్తోంది. గతంలో ఇలాంటి వదంతుల్ని చాలామంది సీరియస్ గా తీసుకునే వారు కాదు. కానీ.. పాక్ పై సర్జికల్ స్ట్రైక్స్ మొదలు కొని పెద్ద నోట్ల రద్దు వరకూ తీసుకుంటున్న మోడీ సర్కారు సంచలన నిర్ణయాలతో ప్రజలకు సరికొత్త భయం మొదలైంది. ఏ నిమిషాన ఎలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుందోనన్న ఆలోచన వారిలో నమ్మకం పాళ్లను భారీగా తగ్గించేసింది.

తాజా ఉప్పుపై సాగుతున్న ప్రచారంతో హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉప్పు మీద ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరిగిపోవటమే కాదు.. ఎన్ని ఉప్పుపాకెట్లు దొరికితే అన్నింటిని దొరకబుచ్చుకొనే పరిస్థితి వచ్చేసింది. దీంతో.. వ్యాపారస్తులు దొరికిందే సందు అన్న తరహాలో ఉప్పు ధరను పెంచేశారు. కేజీ పది రూపాయిలున్న ఉప్పు రేటును ఏకంగా రూ.50 నుంచి రూ.వందకు పెంచేస్తే.. మరికొందరు ఆరాచకంగా రూ.200 వరకూ వసూలు చేయటం గమనార్హం. ఉప్పు ఉత్పత్తి తగ్గిపోయిందని.. త్వరలో ఉప్పు ధర రూ.300నుంచి రూ.500 వరకు పెరుగుతుందన్న ప్రచారమే ఉప్పు డిమాండ్ కు అసలు కారణంగా చెప్పాలి.

ఉప్పునకు ఏర్పడిన కృత్రిమ డిమాండ్ తో చోటు చేసుకున్న మరో ఇబ్బందికర పరిణామం ఏమిటంటే.. గంటల కద్దీ క్యూలో నిలుచుకొని తెచ్చుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని అవసరం లేకున్నా ఉప్పుకొనుగోలు కోసం ప్రజలు ఖర్చు పెట్టేశారు. కేజీ ఉప్పును రూ.200 లెక్కన అమ్ముతున్న పలువురిని అధికారులు పట్టుకోవటమే కాదు.. ప్రజాప్రతినిధులు వెళ్లి మరీ హెచ్చరించిన వైనం హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి. ఉప్పుపై నెలకొన్న డిమాండ్ ను హోల్ సేల్ వ్యాపారులు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ఉప్పు బస్తాపై రూ.400 నుంచి రూ.600 వరకు అదనంగా వసూలు చేయటం గమనార్హం. ఇదిలా ఉంటే.. సూపర్ మార్కెట్లలో ఉప్పుపై సరికొత్త నిబంధనను పెట్టారు. ఒక్కొక్కరికి రెండు ఉప్పు పాకెట్ల కన్నా ఎక్కువ ఇవ్వకూడదని నిర్ణయించారు. దీంతో.. కొంతమంది ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే.. ఉప్పుపై సాగుతున్నది కేవలం వదంతులు మాత్రమేనని.. వాటిని అస్సలు నమ్మాల్సిన అవసరం లేదని పలువురు స్పష్టం చేస్తున్నా.. ప్రజలుమాత్రం వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉప్పును కొనుగోలు చేయటానికి ఆసక్తి ప్రదర్శించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/