Begin typing your search above and press return to search.

రూపాయి మారకం విలువ 80కి.. అలాగైతే పెట్రో ధరల దడే..?

By:  Tupaki Desk   |   8 March 2022 11:48 AM GMT
రూపాయి మారకం విలువ 80కి.. అలాగైతే పెట్రో ధరల దడే..?
X
అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచం తుమ్ముతుంది అనేది ఓ సామెత. అంటే.. దీని అర్థం అక్కడి పరిణామాలు మిగతా దేశాలపై ఎంతటి ప్రభావం చూపుతాయో తెలిసిపోతోంది. కాగా, ఇప్పుడు గ్లోబలైజేషన్ కాలంలో ఏ ఇతర పరిణామాలైనా ఇదే తీరున ప్రభావం చూపుతున్నాయి. ఇందుకు నిదర్శనం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. అకారణంగానో, కారణంగానే ఉక్రెయిన్ పై ఉరిమిన రష్యా.. మిగతా ప్రపంచాన్నీ కలవర పెడుతోంది.

ఈ యుద్ధం ఇలాగే ఉంటే డాలర్‌తో రూపాయి మారకం విలువ 80కి చేరుకోవచ్చని అంటున్నారు. అదే జరిగితే సరికొత్త రికార్డులు అవుతాయి. ఇప్పటికే 2013లో తలెత్తిన వివిధ సంక్షోభాలతో డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.70 దాటింది.

అప్పట్లోనే దీనిపై ఎంతో ఆందోళన వ్యక్తమైంది. కానీ, మళ్లీ రూ.70కి దిగి రాలేదు. తాజాగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం భారత కరెన్సీ రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం మరింత ఎక్కువైతే రూపాయి విలువ ఇంకాస్త పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

పరిస్థితులు సానుకూలంగా లేకుంటే డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80ని తాకినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుత ఏడాదిలోనే 77.93 డాలర్లకు చేరుకోవచ్చునని అంటున్నారు.

పరిస్థితుల్ ఏమాత్రం సానుకూలంగా లేకపోయినా 82కు చేరినా చేరవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో రష్యన్ రూబుల్ కూడా భారీగా క్షీణిస్తోంది. అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు, స్విఫ్ట్ నుంచి తొలగింపు వంటి అంశాలు రూబుల్ క్రితం సెషన్లో పది శాతానికి పైగా నష్టపోవడానికి కారణమైంది.

నేడు మాత్రం కాస్త పుంజుకుంది. అంతేకాదు, ఫారెన్ క్రెడిటార్స్‌కు రూబుల్స్‌లో చెల్లింపులు జరపవచ్చంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దేశంలోని కంపెనీలకు ఓ సూచన చేశారు. ఈ పరిణామాలు కాస్త సానుకూలంగా మారాయి.

కాస్త ఊరట

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం రూపాయి పైన కూడా పడుతోంది. అందుకే సోమవారం 77.44ని తాకి ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. అయితే మంగళవారం కాస్త పుంజుకుంది. ఉదయం గం.12 సమయానికి 76.88 వద్ద ట్రేడ్ అయింది.
విలువ క్షీణిస్తే ఏంజరుగుతుంది?

రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతి వ్యయాలు పెరుగుతాయి. దీని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక రంగాలపై పడుతుంది. ఉదాహరణకు మనం చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. సహజంగానే ఈ ధరలు పెరిగే అవకాశముంటుంది. అప్పుడు రవాణా భారంగా మారి, వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.

అయితే ఐటీ కంపెనీలకు మాత్రం డాలర్ల రూపంలో కాస్త ప్రయోజనం ఉంటుంది. యుధ్దం కొనసాగితే డాలర్ మారకంతో రూపాయి త్వరలోనే 80కి చేరుకునే ప్రమాదం లేకపోలేదని వివిధ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొన్ని బ్రోకరేజీలు 80 నుండి 82కు చేరుకోవచ్చునని అంటున్నాయి.