Begin typing your search above and press return to search.

ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరి రూపాయి విలవిల

By:  Tupaki Desk   |   22 Sep 2022 7:19 PM GMT
ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరి రూపాయి విలవిల
X
పాపం రూపాయి. మన రూపాయి. గత కొన్ని నెలలుగా బక్కచిక్కి పాపాయిలా గగ్గోలు పెడుతోంది. చెల్లని ముఖం పెట్టుకుంటూ ఘొల్లుమంటోంది. రూపాయి విలువ అంతకంతకు తగ్గి విలవిలలాడుతోంది. దీనికంతటికీ కారణం ఏలికల‌ ఆర్ధిక నిర్వహణ నిర్వాకం అని ఆర్ధిక నిపుణులు ఒక వైపు అంటున్నారు. మరో వైపు ప్రపంచ పరిస్థితులు పర్యవశానాలు కూడా రూపాయిని నానాటికీ చిన్నబోయేలా చేస్తున్నాయి.

తాజాగా రూపాయికి వచ్చిన ఉపద్రవం ఏంటి అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ద్రవ్యోల్బణంపై తీసుకున్న చర్యలతో రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే 88 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుని 80.86 వద్ద ముగిసింది. ఇదీ రూపాయి తాజా పరిస్థితి అని అంటున్నారు.

అధిక ద్రవ్యోల్బణ రేట్లను నియంత్రించడానికి అవసరమైన కఠినమైన విధానాల సూచనలతో పాటు వరుసగా మూడవసారి 75 బేసిస్ పాయింట్ల పెంపునకు ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న చర్యలు కూడా రూపాయి పతనానికి కారణం అని అంటున్నారు. రూపాయి పతనానికి ఇతరత్రా అనేక కారణాలు అని ఎల్ కే పీ సెక్యూరిటీస్‌లోని రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది చెప్పడం విశేషం.

అమెరికా డాలర్ ఇండెక్స్ మధ్యాహ్నం ట్రేడ్‌లో $111.50 పైన కోట్ చేయడంతో ఏకంగా 20 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన వివరించారు. అంతే కాదు రూపాయి 79.95 నుండి 80.77కి 1 శాతం కంటే ఎక్కువ పడిపోయిందని పేర్కొన్నారు. దేశీయంగా అనేక చర్యలు తీసుకున్నా కూడా రూపాయి ప్రస్తుత క్షీణత కొంతకాలం కొనసాగవచ్చని ఆయన చెప్పడం గుబులు పుట్టించే పరిణామంగానే చూడాలి.

ఇక్కడ చిత్రమేంటి అంటే మన రూపాయే కాదు జపనీస్ యెన్ కూడా 0.6860 దిగువకు పడిపోయిందని భోగట్టా. ఇక చూస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచి 3-3.25 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంతో పాటు సెంట్రల్ బ్యాంక్ నిబద్ధతను పునరుద్ఘాటించడంతో వరసగా మూడవ వరుస 75 బేసిస్ పాయింట్ల పెంపు జరిగింది. ఈ పరిణామాల నేపధ్యంలో రూపాయి భారీ క్షీణతకు దారితీశాయని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో భారతీయ ఈక్విటీలు గురువారం నాటికి బాగా పడిపోయాయని డీలర్లు తెలిపారు. అలాగే చూసుకుంటే సెన్సెక్స్ 337.06 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 59,119.72 వద్ద, నిఫ్టీ 88.55 పాయింట్లు లేదా 0.50 శాతం క్షీణించి 17,629.80 వద్ద ముగిశాయి. గురువారం దాదాపు 1,814 షేర్లు పురోగమించగ 1,628 క్షీణించాయి. అయితే 147 షేర్లు మారలేదని ట్రేడ్ వర్గాల భోగట్టా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.