Begin typing your search above and press return to search.

ఒక అమెరిక‌న్ డాల‌ర్ విలువ 80 రూపాయిలు భారీ ప‌త‌నం.. కార‌ణాలివే!

By:  Tupaki Desk   |   15 July 2022 4:30 AM GMT
ఒక అమెరిక‌న్ డాల‌ర్ విలువ 80 రూపాయిలు భారీ ప‌త‌నం.. కార‌ణాలివే!
X
భార‌త రూపాయి క్షీణిస్తోంది. అమెరిక‌న్ డాలర్‌తో పోల్చిన‌ప్పుడు భారతదేశ రూపాయి విలువ అంత‌కంత‌కూ వేగంగా క్షీణిస్తోంది. ప్ర‌స్తుతం ఒక అమెరిక‌న్ డాల‌ర్ విలువ 80 రూపాయిలుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్ లో రూ.80.04గా ఉంది. ప్ర‌స్తుతం 79.99 వ‌ద్ద కొన‌సాగుతోంది. ఎగుమ‌తుల‌తో పోలిస్తే అంత‌కంత‌కూ పెరుగుతున్న భార‌త్ దిగుమ‌తులు, దేశం నుంచి విదేశీ పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డుల‌ను ఉపసంహ‌రించుకోవ‌డం, ఉక్రెయిన్ -రష్యా యుద్ధం ప్ర‌భావం, ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్కెట్ల అనిశ్చితి రూపాయి ప‌త‌నానికి కార‌ణాలుగా నిలుస్తున్నాయి.

రూపాయి విలువ క్షీణించడం వల్ల ప్రజలపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మన దేశం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది కాబట్టి ద్రవ్యోల్బణం (ధ‌ర‌ల పెరుగుద‌ల‌)తో రూపాయి పతనం తాలూకు సెగ తప్పకుండా తగులుతుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి, పేద‌ల‌పై రూపాయి ప‌త‌నం ప్ర‌భావం ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు.

కాగా ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి విలువ అంత‌కంత‌కూ పతన‌మ‌వుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022 ఫిబ్రవరి నుంచి దాదాపు 26 సార్లు రూపాయి పతనమైంది. ఒక్క జూలై నెల‌లోనే ఆరుసార్లు రూపాయి విలువ ప‌డిపోయింది.

ఇత‌ర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన వస్తువులు, చమురు కోసం మ‌నం అమెరికా డాలర్లలో చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి రూపాయి విలువ బలహీనపడినపడినందువల్ల దిగుమతి చేసుకున్న వస్తువుల‌కు అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో విదేశాల నుంచి మ‌నం ఎక్కువగా దిగుమ‌తి చేసుకునే ఎలక్ట్రానిక్స్ నుంచి ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ వరకు వినియోగదారులు అధిక మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అమెరికాలో చ‌దువుకుంటున్న భార‌తీయ విద్యార్థులు, ఆ దేశానికి ప్రయాణాలు చేసేవారు కూడా భారీగా ఖ‌ర్చు పెట్టుకోక త‌ప్ప‌దు. డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ భారీగా ప‌డిపోవ‌డమే ఇందుకు కార‌ణం.

అమెరికాలో విద్య, ప్రయాణాల ఖర్చులు గత ఆరు నెలల్లో ఏడు శాతం మేరకు పెరిగాయ‌ని మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. ఇప్పుడు రూపాయి ప‌త‌నం ప్ర‌భావంతో మ‌రింత భారం ప‌డుతుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.