Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలకు చైనా షాక్

By:  Tupaki Desk   |   21 Jun 2022 5:30 PM GMT
ప్రపంచ దేశాలకు చైనా షాక్
X
ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాను దెబ్బతీయటానికి ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలకు డ్రాగన్ పెద్ద షాకిచ్చింది. ఒకవైపు రష్యాను ఆర్ధికంగా దెబ్బతీయాలని అగ్రరాజ్యంతో పాటు నాటో దేశాలు చేస్తున్న ప్రయత్నాలను చైనా దెబ్బకొట్టింది. రష్యా నుండి చమురును దిగుమతి చేసుకునేందుకు చైనా అతిపెద్ద ఒప్పందాన్ని చేసుకున్నది. ఇప్పటివరకు చైనాకు చమురును అందిస్తున్న అతిపెద్ద దేశం సౌదీఅరేబియా మాత్రమే.

అలాంటి సౌదీని ఇపుడు చేసుకున్న తాజా ఒప్పందంతో రష్యా వెనక్కు నెట్టేసింది. చైనాకు అవసరమైన చమురును ఈస్ట్ సైబీరియా పసిఫిక్ పైప్ లైన్ కంపెనీ నుండి సముద్రమార్గంలో చమురును సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది. విచిత్రం ఏమిటంటే నిజానికి రష్యానుండి చమురును పెద్దఎత్తున కొనాల్సిన అవసరం చైనాకు లేకపోయినా అమెరికా, నాటో దేశాలను రెచ్చగొట్టేందుకు మాత్రమే చమురును కొంటున్నట్లు అర్ధమవుతోంది.

రష్యానుండి చమురు దిగుమతులు తగ్గించుకుని, గ్యాస్ సరఫరాను తగ్గించుకుని ఆర్ధికంగా దెబ్బకొట్టాలని నాటో దేశాలు చేసిన ప్లాన్ వాటికే బెడిసికొడుతున్నాయి. ఎలాగంటే రష్యానుండి కొనుగులు చేస్తున్న చమురు, గ్యాస్ ను తగ్గించుకోవాలని డిసైడ్ చేశాయి కానీ ప్రత్యామ్నాయంగా ఏ దేశం నుండి కొనాలో అర్ధం కావటంలేదు.

ఎందుకంటే దాదాపు 30 దేశాలకు అవసరమైన చమురు, గ్యాస్ ను రష్యా మాత్రమే సరఫరా చేస్తోంది. ఇపుడు రష్యా నుండి సరఫరా తగ్గిపోవటంతో ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, ఇటలీ, స్లొవేకియా లాంటి దేశాలు నానా అవస్తలు పడుతున్నాయి.

చమురు, గ్యాస్ వాడకాన్ని తగ్గిచుకోమని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి. ఈ దేశాలు విధించిన నిషేధం రష్యాపై ఎలాంటి ప్రభావం చూపలేదని తేలిపోయింది. ఎందుకంటే గడచిన 100 రోజుల్లో రష్యా 100 బిలియన్ డాలర్ల చమురును అమ్మేసింది.

రష్యా నుండి భారీఎత్తున చైనా, భారత్ చమురును కొంటుడటంతో నిషేధ ప్రభావం పెద్దగా కనబడటంలేదు. మేనెలలో భారత్ కు రష్యానుండి ప్రతిరోజు 7.4 లక్షల బ్యారెళ్ళ ముడిచమురు దిగుమతయ్యింది. జూన్ నెల పూర్తయితే కానీ ఈ నెలలో ఎన్ని లక్షల బ్యారెళ్ళ చమురు దిగుమతయ్యిందో తెలీదు. మొత్తానికి రష్యాను ఏదో చేద్దామని అనుకున్న దేశాలే ఏమో అయిపోతున్నాయి.