Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేయటం ఏంటి? మన వంటింట్లో మంట పుట్టటమా?

By:  Tupaki Desk   |   25 Feb 2022 2:16 AM GMT
ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేయటం ఏంటి? మన వంటింట్లో మంట పుట్టటమా?
X
అక్కడెక్కడో ఉన్న రష్యా.. దానికి అనుకొని ఉండే ఉక్రెయిన్. వారిద్దరి మధ్య రచ్చ. న్యాయం.. అన్యాయాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. మనకు మాత్రం సంబంధం లేని రెండు దేశాలు యుద్ధం చేసుకోవటమేంది? మన వంటింట్లో మంట పుట్టడం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తక మానదు. కానీ.. ఇప్పుడు అదే జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఉక్రెయిన్ మీద సైనిక చర్య పేరుతో రష్యా మొదలు పెట్టేసిన యుద్ధం.. భారతీయుడి వంటింటి మీద ప్రభావం పడటం ఆసక్తికరంగా మారింది.

యుద్ధం మొదలైన గంటల వ్యవధిలోనే మన మీద ఎఫెక్టు పడటం చూస్తే.. మార్కెట్ మాయాజాలం అనుకోకుండా ఉండలేం. ఆఖరి క్షణంలో అయినా.. యుద్ధం ఆగిపోతుందన్న అంచనాలకు భిన్నంగా.. వార్ మొదలు కావటం.. ఇక ఎప్పటికీ ముగుస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో.. స్టాక్ మార్కెట్ భయాందోళనలు ఎంత భారీగా నష్టపోయేలా చేశాయో తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం మొదలు పెట్టిన వేళ.. ముడి చమురు మీద ప్రభావం పడుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్లే.. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు మంట పుట్టేలా ధరలు పెరిగాయి.

ఇది చాలదన్నట్లు వంట నూనెల మార్కెట్ సైతం వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిజానికి.. ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ తప్పించి.. పామాయిల్ దిగుమతులు ఉండవు. పామాయిల్ ఎక్కువగా ఇండోనేషియా.. మలేషియా నుంచే ఎక్కువగా జరుగుతుంటుంది. కానీ.. రష్యా - ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో చోటుచేసుకున్న భయాందోళనలు పామాయిల్ ధర మీదా ప్రభావం పడింది.

తాజాగా అందుతున్న మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. పామాయిల్ మీద లీటరుకు కనీసం రూ.20వరకు పెరిగితే.. సన్ ఫ్లవర్ ఆయిల్ మీదా రూ.15 నుంచి రూ.25 వరకు పెంచేసినట్లు చెబుతున్నారు.

వంట నూనెల పాకెట్ల మీద ప్రింట్ చేసే ధరలకు.. వాటిని అమ్మే వాటికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో.. తాజాగా పెంచిన ధరల కారణంగా వినియోగదారుడు మాత్రమే నష్టపోయే పరిస్థితి. హోల్ సేల్ మార్కెట్ పెరిగిపోవటంతో రిటైల్ వర్తకులు సైతం ఆయిల్ ధరల్ని భారీగా పెంచేశారు. యుద్ధం కనుక కొనసాగితే.. రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరింత మంట పుట్టేలా మారతాయన్న మాట వినిపిస్తోంది. ఎక్కడో యుద్ధం జరగటం ఏమిటి? మన వంటింట్లో ధరల బాంబు పేలటం ఏమిటో ఇప్పడు అర్థమైందా?