Begin typing your search above and press return to search.

డ్రాగన్ కు సుఖోయ్ ల్ని ఇచ్చేసింది

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:31 AM GMT
డ్రాగన్ కు సుఖోయ్ ల్ని ఇచ్చేసింది
X
ఫ్రెండ్ షిప్.. ఫ్రెండ్ షిప్పే.. పేకాట పేకాటే అన్నట్లుంది రష్యా వ్యవహారం చూస్తుంటే. తొంభయ్యే దశకం వరకూ భారత్.. రష్యాల మధ్య సంబంధాలు ఎంత ఎక్కువగా ఉండేవో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాతో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన భారత్.. రష్యాతో మాత్రం జాన్ జిగిరీ దోస్తానా నడిపించిందని చెప్పాలి.

సోవియెట్ యూనియన్ ముక్కలైన తర్వాత.. రష్యాతో ఉన్న ఫ్రెండ్ షిప్ కాస్త తగ్గించి.. పెద్దన్నగా అవతరించిన అమెరికాతో దోస్తీ మొదలెట్టింది. రోజులు గడిచే కొద్దీ..ఈ స్నేహం మరింత పెరిగింది. అదే సమయంలో రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధాలు కాస్త తగ్గాయి. దీనికి సంబంధించిన పరిణామాలు ఈ మధ్యన తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు భారత్ కు అగ్రతాంబూలం ఇచ్చిన రష్యా.. ఇప్పుడు తన తీరును చాలా వరకూ మార్చుకుందనే చెప్పాలి.

తాజాగా మనకిచ్చిన సుఖోయ్ ఎస్ యూ 35 యుద్ధ విమానాల్ని చైనాకు ఇచ్చేసిన విషయం బయటకు వచ్చింది. సుఖోయ్ పోలిన యుద్ధ విమానాల్ని చైనా సొంతంగా తయారు చేసుకోవటం మొదలెట్టిన నేపథ్యంలో.. సుఖోయ్ విమానాల డీల్ విషయంలో ముందు వెనుకా అన్నట్లుగా వ్యవహరించిన రష్యా.. అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో తన యుద్ధ విమానాల్ని చైనాకు ఇచ్చే డీల్ ను మరింత స్పీడ్ అప్ చేసినట్లుగా చెప్పొచ్చు.

ఈ ఒప్పందంలో భాగంగా డిసెంబరు 25న సుఖోయ్ విమానాల్ని రెండింటిని చైనాకు అందించిన సమాచారం తాజాగా బయటకు వచ్చింది. తాజా పరిణామంతో.. చైనా వాయుసేన మరింత బలోపేతమైనట్లుగా చెప్పకతప్పదు. వాయుసేనను భారీగా పెంచుకుంటున్న చైనా.. ఇప్పుడు కొత్తతరం ఫైటర్ జెట్లతో నింపుతోంది. ఇది భారత్ కు ఆందోళన కలిగించే అంశమనే చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/