Begin typing your search above and press return to search.

మారియుపోల్‌ పై రష్యా పట్టు.. ఉక్రెయిన్ కు అల్టిమేటం

By:  Tupaki Desk   |   17 April 2022 10:50 AM GMT
మారియుపోల్‌ పై రష్యా పట్టు.. ఉక్రెయిన్ కు అల్టిమేటం
X
మారియుపోల్.. ఉక్రెయిన్ లోని దక్షిణ తీర రేవు నగరం. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్, రష్యా రెండు దేశాలకూ కీలకం. యుద్ధం మొదలైన వెంటనే రష్యా ఈ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. అయితే, వారికి అక్కడి ఉక్రెయిన్ మెరైన్ సైనికులు తీవ్రంగా అడ్డు తగిలారు. యోధుల్లా పోరాడుతూ 50 రోజులుగా ఈ నగరం రష్యా పరం కాకుండా కాపాడుతున్నారు. కానీ, ఇటీవల వారి శక్తి సన్నగిల్లింది. చాలామంది చనిపోయారు. మిగతావారు గాయపడ్డారు. దీంతో కొద్ది మంది తోనే పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకిక చావోరేవో అంటూ వారు ఐదురోజుల కిందట ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మరోవైపు 2014 లో తాను ఆక్రమించిన క్రిమియా (ఉక్రెయిన్ భూభాగం)కు ల్యాండ్ కనెక్టివిటీ కావాలంటే మారియుపోల్ ను వశం చేసుకోవడం రష్యాకు కీలకం. కాబట్టి ఈ నగరంపై రష్యా కన్నేసింది.

20 వేల మందిని హతమార్చింది మారియుపోల్ నగరం మొత్తం జనాభా 4 లక్షల పైనే. కానీ, యుద్ధం అనంతరం అక్కడ మిగిలినది 1.20 లక్షల మంది మాత్రమే. వీరందరికీ మానవతా సాయం అందించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రయత్నాలు చేసింది. అయితే, మారియుపోల్ లో భీకరంగా విరుచుకుపడి 20 వేల మంది ప్రాణాలు తీసిన రష్యా.. బయటి వారు ఈ నగరంలోకి వస్తే తమ దారుణాలు బయటపడతాయని భయపడింది.

దీంతో మానవతా సాయాన్ని కూడా అడ్డుకుంది. చివరకు వీధుల్లో గుట్టలుగా పేరుకుపోయిన శవాలను తరలించేందుకు మార్గం లేక సంచార దహన వాటికలను తెప్పించింది. వాటితో అంత్యక్రియలు చేసింది. మరోవైపు కొన్ని శవాలను ఓ భారీ సూపర్ మార్కెట్ లో భద్రపరించింది అన్న వార్తలు కూడా వచ్చాయి.

ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవాలి: రష్యా
ఈ నెల మొదట్లో ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న కీవ్ నుంచి వైదొలగిన రష్యా.. తూర్పు, దక్షిణంలోని మారియుపోల్, డాన్ బాస్ ప్రాంతాలపై కన్నేసింది. తమకు అనుకూల ప్రాంతాలు ఉండడంతో ఇక్కడ పట్టు సాధించడం తేలికని భావిస్తోంది. ఈ క్రమంలో మారియుపోల్ పై మరింత పట్టు బిగించింది. మేరియుపోల్‌లో ఉన్న ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా అల్టిమేటం జారీ చేసింది.

లొంగిపోయిన సైనికుల ప్రాణాలకు రష్యా హామీ ఇస్తుందని పేర్కొంది. వీరందరినీ జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధఖైదీలుగా పరిగణించి సదుపాయాలు కల్పింస్తుందని వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యా నిన్న రాత్రి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఉక్రెయిన్‌ వర్గీయులకు వెల్లడిస్తోంది.మాస్కోకాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెడ్‌లైన్‌ విధించింది. ప్రస్తుతం మేరియుపోల్‌లో లక్ష మంది మిగిలి ఉన్నారు.

ఈ నగరంలో అత్యధిక ప్రాంతం రష్యా ఆధీనంలోనే ఉంది. ఈ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని నిన్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రష్యా అల్టిమేటం విడుదల కావడం గమనార్హం. ఇప్పటికే రష్యా దళాలు ఈ నగరంపై పట్టు సాధించాయి. చాలా చిన్న ప్రాంతాల్లోనే ఉక్రెయిన్‌ మద్దతుదారులు ఉన్నారు.

ఉక్రెయిన్‌ విమానం కూల్చేశాం.. ఉక్రెయిన్‌ పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలను తీసుకెళుతున్న ఓ విమానాన్ని తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ పసిగట్టి కూల్చేసిందని రష్యా రక్షణశాఖ ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఇగోర్‌ కన్సెన్‌కోవ్‌ వెల్లడించారు. గత 24 గంటల్లో రష్యా వాయుసేన డజన్ల కొద్దీ ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు వివరించారు.