Begin typing your search above and press return to search.

ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్యా .. 4 వ్యాక్సిన్లు సిద్ధం !

By:  Tupaki Desk   |   23 July 2020 9:50 AM GMT
ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన రష్యా .. 4 వ్యాక్సిన్లు సిద్ధం !
X
కరోనా వైరస్ ను అరికట్టడానికి సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా , ఆతృతగా ఎదురుచూస్తోంది. 200కి పైగా దేశాలు కరోనా వైరస్ ప్రభావంతో సతమతమవుతుండగా, 85 దేశాల నిపుణులు ఈ కరోనా ను అరికట్టే సరైన వ్యాక్సిన్ కోసంతీవ్రంగా శ్రమిస్తున్నారు. అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలకు చెందిన ఫార్మా సంస్థలు ఈ విషయంలో వేగంగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని వాక్సిన్ లను మనుషులపై ప్రయోగించారు. మరికొన్ని దశల్లో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉన్నది.

ఇక రష్యాలోని ప్రభుత్వ రంగ సంస్థ గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే కీలక దశలు అధిగమించి క్లినికల్ ట్రయల్స్ లోనూ అమోఘమైన ఫలితాలను ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, రష్యా నుంచి మరో మూడు వ్యాక్సిన్లు కూడా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. రష్యా దేశంలోని 17 ఫార్మా సంస్థలు వాక్సిన్ తయారీలో పరిశోధనలు చేస్తున్నారు. దీని గురించి రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ మాట్లాడుతూ, తమ దేశంలో 26 కంటే ఎక్కువ వాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయని, అందులో 4 వ్యాక్సిన్లు సురక్షితమైనవిగా భావిస్తున్నామని తెలిపారు. ఆ నాలుగు వ్యాక్సిన్లు మానవులపై ప్రయోగించేందుకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయని భావిస్తున్నామని మిషుస్తిన్ వెల్లడించారు. ట్రయల్స్ పూర్తి కాగానే ఆ నాలుగు వాక్సిన్ లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.