Begin typing your search above and press return to search.

కరోనా తొలి వ్యాక్సిన్ డోస్ ఆ దేశం వారికే...ఫిక్స్

By:  Tupaki Desk   |   30 July 2020 1:30 AM GMT
కరోనా తొలి వ్యాక్సిన్ డోస్ ఆ దేశం వారికే...ఫిక్స్
X
మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకీ భారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు. ప్రపంచమంతా ఆసక్తిగా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. వ్యాక్సిన్ కోసం అమెరికా, చైనా, యూకేలతోపాటు మరి కొన్ని దేశాలు చేపట్టిన ప్రయోగాలు దశల వారీగా కొనసాగుతున్నాయి. అయితే, వీటన్నిటిలోకి లేటుగా ప్రయోగాలు ప్రారంభించిన రష్యా మాత్రం అందరికంటే ముందుగా వ్యాక్సిన్ విడుదల చేస్తానంటోంది. రష్యాలోని మాస్కోకు చెందిన గమాలియో ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ను ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రజలకు పంపిణీ చేయాలని రష్యా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. దేశీయంగా 30 మిలియన్లు, మిగతా దేశాలలో 170 మిలియన్ల డోసులు తయారు చేస్తున్నామని ప్రకటించింది.

తమ వ్యాక్సిన్ సక్సెస్ అని రష్యా ప్రకటించడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒక వ్యాక్సిన్ అన్ని దశల ట్రయల్స్ ను పూర్తి చేసుకొని....ఆ తర్వాత ఉత్పత్తి అయి...మార్కెట్లోకి విడుదలై...జనాల చేతికి చేరే సరికి చాలా సమయం పడుతుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. పులిహోర కలిపినంత ఈజీగా వ్యాక్సిన్ కనిపెట్టలేమని, అందుకే సుదీర్ఘ కాలం ప‌రిశోధ‌న‌లు, పరీక్షలు,పరిశీలనలు అవసరమని చెబుతున్నారు. అయితే, రష్యా మాత్రం ప్రపంచంలో తామే మొట్టమొదటగా వ్యాక్సిన్ ను ఆగస్టు 10న విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ చెబుతోంది. కరోనా రిస్క్ ఎక్కువ అవకాశమున్న వైద్య సిబ్బంది, వృద్ధులు, చిన్న పిల్లలు, ఆపరేషన్లు చేయించుకున్నవారు తదితరులకు వ్యాక్సిన్ ముందుగా వేసే అవకాశముందట. ఆగ‌స్టు 9 నాటికి వ్యాక్సిన్ కు పూర్తి ఆమోదం లభించిన వెంటనే ఆగస్టు 10న మార్కెట్లోకి విడుదల చేసేందుకు రష్యా రెడీగా ఉందట. మరి, అన్ని అనుకున్నట్లు జరిగితే ప్రపంచంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన దేశంగా రష్యా చరిత్రపుటల్లో నిలిచిపోతుంది.